సమన్వయంతో పనిచేయండి
● సచివాలయాల జిల్లా ప్రత్యేకాధికారి రామ్‌గోపాల్
సాలూరు: సచివాలయ ఉద్యోగులు సమన్వయంతో సమష్టిగా పని చేయాలని గ్రామ,వార్డు సచివాలయాల జిల్లా ప్రత్యేకాధికారి బి.రామ్‌గోపాల్ తెలిపారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో సాలూరు మున్సిపాలిటీ, మండలం, పాచిపెంట మండలంలోని సచివాలయ ఉద్యోగులతో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగుల హాజరు, హౌస్‌హోల్డ్ జియో లొకేషన్ సర్వే, ఎన్‌పీసీఐ లింకింగ్, పాఠశాలల తనిఖీ తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బయోమెట్రిక్ పరికరాలు లేకపోవడం, సిబ్బంది కొరత, ఉన్న సిబ్బందికి వేర్వేరు సర్వే పనులు అప్పగించడం వంటి సమస్యలను సచివాల య ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో గ్రామవార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త వి.చిట్టిబాబు, ఎంపీడీఓ రమాదేవి, ఏఓ పార్వతి, పాల్గొన్నారు.
వసతిగృహాల నిర్వహణ, మరమ్మతులకు ప్రతిపాదనలు
● ‘సాక్షి’ కథనానికి స్పందన
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ బీసీ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు కాస్మోటిక్ చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరపడానికి చర్యలు తీసుకున్నామని బీసీ సంక్షేమాధికారి ఎస్.కృష్ణ తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వెనుకబడిన తరగతుల విద్యార్థుల వసతిగృహాల నిర్వహణ, మరమ్మతుల నిమిత్తం నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామని చెప్పారు. ఈ నెల 19న ‘సాక్షి’లో ‘సమస్యలతో సహవాసం’ శీర్షికను వసతిగృహాల దుస్థితిపై ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. 12 బీసీ వసతిగృహాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి మౌలిక సదుపాయాలు, మరమ్మతులకు రూ.2.47 కోట్లు అవసరమవుతాయని గుర్తించి.. ఆ మేరకు ప్రతిపాదనలు సమర్పించామని వివరించారు. విద్యార్థుల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని.. అందుకు రూ.5.50 లక్షలు అవసరమవుతాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
వీఓఏల ఆందోళన
పార్వతీపురం: ఏపీ వైకేపీలో వీఓఏలుగా (యానిమేటర్స్) పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేశారు. అక్కడే భైఠాయించి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. హెచ్‌ఆర్ పాలసీని అమలుచేయాలని, ఉద్యోగ భద్రత, గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ధర్మరాజు మాట్లాడుతూ మహిళలకు–ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవ హరిస్తున్న వీఓఏలపై నిర్లక్ష్యం తగదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న అన్ని సౌకర్యాలను వీఓలకు అందించాలన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి.ఇందిర మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ●
పార్వతీపురంటౌన్: అభ్యసనా లక్ష్యాల సాధనకు ఆరోగ్య సమస్యలు అవరోధం కాకుండా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.విజయపార్వతి సిబ్బందికి సూచించారు. పార్వతీపురం మండలంలోని తాళ్లబురిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె బుధవారం సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల లభ్యతపై ఆరా తీశారు. ఆరోగ్య జాగ్రత్తలు వివరించా రు. పాఠశాలలో తాగునీటి స్వచ్ఛత పరీక్షలను వైద్య సిబ్బందితో చేయించారు. కార్యక్రమంలో డీఐఓ టి.జగన్‌మోహన్‌రావు, హెచ్‌ఎం జి.అరుంధతి, డెమో యోగీశ్వరరెడ్డి, పి.భూలక్ష్మి, బి.సుశీల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment