26న కలెక్టరేట్ వద్ద ధర్నా
విజయనగరం పూల్‌బాగ్: కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్‌పీఅర్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయినా తమ విధానాల్లో మార్పు లేదన్నారు. కుక్కతోక ఒంకరని మరోసారి మోదీ ప్రభుత్వం రుజువు చేసుకుందన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాలు రాష్ట్రంలో అదే విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. సర్వసంపదలు సృష్టించేది కార్మికవర్గం, ప్రజలకు తిండిపెట్టేది రైతాంగమని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. కేవలం కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలంగా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.19.28లక్షల కోట్లు రుణమాఫీ, పన్ను రాయితీ, ప్రోత్సాహాల పేరుతో ప్రజల ధనాన్ని దోచి పెట్టిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌తో సహా భారీ పరిశ్రమలు, గనులు, సముద్రతీరాన్ని కారుచౌకగా కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతుందన్నారు. వ్యవసాయ దేశమైన భారతదేశంలో కార్మిక వర్గం, రైతాంగంతో కలిసి ఐక్యంగా పోరాడితేనే మన లక్ష్యం సాధించగలమన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని చీల్చాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం ప్రయత్నిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ 26న కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాలో కార్మికులు, రైతులు, ప్రజా సంఘాలు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, కార్యదర్శి ఎ.జగన్‌మోహన్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, ఇఫ్టూ నాయకులు కె.అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు.
కార్మిక, రైతు సంఘాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment