రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
బాడంగి/బొబ్బిలి: బొబ్బిలి పట్టణంలోని రాజ్‌మహల్‌కు వెళ్లే ఓవర్ బ్రిడ్జి కిందగల రైల్వేట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి బాడంగి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన కొండేటి చంద్రశేఖర్ (21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి కుటుంబసభ్యులు, రైల్వే ఎస్సై బాలాజీ తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం భీమవరానికి చెందిన తాతయ్య అప్పన్న, నాయనమ్మ చిన్నమ్మి వద్ద రెండేళ్లుగా చంద్రశేఖర్ ఉంటూ ఉద్యోగం వేటలో భాగంగా బొబ్బిలిలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చదువుకుంటూ భీమవరం నుంచి రోజూ రాకపోకలు సాగిస్తున్నాడు. చంద్రశేఖర్ తండ్రి నారాయణరావు మూడేళ్ల క్రితమే చనిపోగా తల్లి పైడితల్లి పొట్టకూటి కోసం పెద్దకుమారుడు సత్యనారాయణతో కలిసి గుంటూరులోని పత్తిమిల్లులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. చంద్రశేఖర్ కూడా గుంటూరులోనే డిగ్రీ వరకు చదువుకుని ఏదైనా ఉద్యోగం సాధించాలన్న తపనతో రెండేళ్ల క్రితం తాత, నాయనమ్మల దగ్గరికి వచ్చి బొబ్బిలిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. తన తల్లి పంపించిన డబ్బులు ఏటీఎంలో తీసుకోవాలని ఇంటి దగ్గర చెప్పి సోమవారం ఉదయం 11గంటలకు బొబ్బిలి వెళ్లిన చంద్రశేఖర్ రాత్రి అయినా రాకపోవడంతో తాత, నాయనమ్మలు ఫోన్‌చేశారు. స్నేహితుల దగ్గర ఉండి మంగళవారం వస్తానని తమ మనుమడు చెప్పాడని ఇంతలోనే ఇలా జరిగిందంటూ రోదిస్తున్నారు. అయితే దీనిపై రైల్వే ఎస్సై బాలాజీ వివరణ మేరకు రెండు రోజులుగా బొబ్బిలి రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో చంద్రశేఖర్ పోలీసులకు కనిపిస్తూ తిరిగి వెళ్లిపోయేవాడు. చివరిగా మంగళవారం వేకువజామున ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌లోని సమాచారం మేరకు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడినట్లు తెలుస్తోందని ఎస్సై బాలరాజు అభిప్రాయ పడ్డారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బొబ్బిలి ఆస్పత్రికి రైల్వేపోలీసులు తరలించారు.
విలపిస్తున్న కుటుంబసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment