విజయమే లక్ష్యం కావాలి
పార్వతీపురంటౌన్: డీఎస్సీలో విజయమే లక్ష్యంగా చదువు సాగించాలని కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ ఉపాధ్యాయ అభ్యర్థులకు సూచించారు. పార్వతీపురం గిరిజన భవన్‌లో నిర్వహిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఆయన సోమవారం సందర్శించారు. అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడుతూ బోధన, ఆహార సదుపాయాలు, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తాము ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో దాని పట్ల మరింత ఏకాగ్రతతో చదువుతూ పట్టు పెంచుకోవాలని సూ చించారు. అసాధ్యాలను సుసాధ్యం చేసేలా కృషి చేసి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. టాపర్లుగా నిలవాలనే ఆలోచన ఆశయ సాధనకు మూలం కాగలదని చెప్పారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం, వాటి మోడల్ పేపర్లను సాధన చేయ డం ద్వారా విజయాలు అందుకోగలరని కలెక్టర్ చెప్పారు. తెలివితేటల్లో అందరూ దాదాపుగా సమానంగా ఉంటారని, కృషి విజయాలను సాధించి పెడుతుందనే అంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు. కష్టేఫలి అనే నానుడిని ఉదాహరిస్తూ ఫలితాల సాధనకు మన ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉపకరిస్తుందని తెలిపారు. లక్ష్యసాధన దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం సాధన చేయాలని, కుటుంబాలను అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి కృషి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ నాయుడు, ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న
కర్షకుని వర్ణ చిత్రం
గరుగుబిల్లి: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నాగూరు గ్రామానికి చెందిన నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు వేసిన ‘భుజంపై నాగలిపట్టి పొలానికి వెళ్తున్న రైతు’ వర్ణ చిత్రం పలువురిని ఆకర్షించింది. ఆయన పర్వదినాలు, ప్రత్యేక దినాలను పురస్కరించుకొని వేస్తున్న చిత్రాలు ఈ ప్రాంతీయులను ఆకట్టుకుంటున్నాయి.
డ్వామా పీడీగా శారదాదేవి
విజయనగరం ఫోర్ట్: జిల్లా నీటియాజయాన్య సంస్థ (డ్వామా) పీడీగా ఎస్.శారదాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పంచాయతీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ డ్వామా పీడీగా పనిచేసిన ఇ.సందీప్ సెలవు పెట్టడంతో అతని స్థానంలో ఎస్.కోట ఏపీడీ, డీఎల్‌డీఓగా పనిచేస్తున్న శారదాదేవిని నియమించారు.
చెరకు క్రషింగ్ పునఃప్రారంభం
రేగిడి: మండలంలోని సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం చెరకు క్రషింగ్‌ను సోమవారం పునఃప్రారంభించింది. ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు చెరకు క్రషింగ్‌ను నిలుపుదల చేసింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడం, చెరకును రైతులు తరలిస్తుండడంతో క్రషింగ్‌ను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment