బాబుపాలనలో భారాల బాదుడు
సాలూరు: టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలపై వివిధ భారాల బాదుడు గ్యారంటీగా మారిందని, భవిష్యత్‌కు గ్యారంటీ లేకుండా పోయిందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరులోని తన స్వగృహంలో స్థానిక విలేకర్లతో ఆయన సోమవారం మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి నేతలు... ఇప్పుడు ప్రజలపై బిల్లుల భారం వేస్తున్నారని ఆరోపించారు. డిస్కింలను ఆదుకునేందుకు చంద్రబాబు చేసిన సాయం రూ.13,255 కోట్లు మాత్రమే కాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.47,000 కోట్లు అందించి డిస్కింలకు చేయూతనిచ్చిందని వివరించారు. ఓ వైపు విద్యుత్ చార్జీలు, మరోవైపు భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, వరద సెస్‌లు, చివరికి పేదవాని పూరిగుడిసెల మీద కూడా భారం మోపడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రజలపై సుమారు రూ.15,485.36 కోట్ల విద్యుత్ భారం మోపింద న్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందని ద్రాక్షగా కనిపిస్తోందన్నారు. పేద ప్రజలపై భారం వేయడమే చంద్రబాబు సంపద సృష్టంటూ మండిపడ్డారు.
సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా, సర్వేల పేరుతో పింఛన్ల తొలగింపునకు పూనుకోవడం అన్యాయమన్నారు. ప్రజలపై వేస్తున్న భారాలకు నిరసగా ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు విద్యుత్ ఏడీఏ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామని, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు గిరి రఘు, సింగారపు ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ భారానికి నిరసనగా 27న విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment