కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా.. గురువుల అర్ధనగ్న ప్రదర్
పార్వతీపురం: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయ ప్రధానగేటు వద్ద సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగభద్రత కల్పించాలని, సీఆర్టీలుగా మార్చాలని, 2022 పీఆర్‌సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో తమ పోస్టులను మినహాయించాలంటూ నినదించారు. అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల జిల్లా అధ్యక్షుడు నిమ్మక దివాకర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని నెలరోజుల పైబడి దీక్షలు చేస్తున్నా అధికారులు, పాల కులు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. స్థానికంగా ఉన్న గిరిజన సంక్షేమశాఖ మంత్రికి గురువుల సమస్య పట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న 1659 మందికి న్యాయం చేయాలని కోరారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు పాలక రంజిత్‌కుమార్, వై.మన్మథరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిరిజన ఉపాధ్యాయులకు సంఘీబావం
గిరిజన ఉపాధ్యాయులకు సంపూర్ణ మద్దతు
ఉంటుందని కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్, వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా కన్వీనర్ డీవీ రమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ ప్రకటించారు. గిరిజన గురుకుల ఉపాధ్యాయులు చేస్తున్న దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. నిరసన దీక్షలు చేపట్టి 34రోజులు గడుస్తున్నా అధికారులు, పాలకుల్లో చలనం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకొని కుటుంబపోషణ చేస్తున్న ఉపాధ్యాయులను అకారణంగా తొలగించడం హేయమైన చర్యగా అభిప్రాయపడ్డారు. సమస్య పరిష్కారమయ్యేంతవరకు ఆందోళన కొనసాగిస్తారన్నారు. ప్రభుత్వం గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి పాకల సన్యాసిరావు, కోరాడ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
34వ రోజుకు చేరుకున్న గిరిజన ఉపాధ్యాయుల నిరసన దీక్షలు
Comments
Please login to add a commentAdd a comment