చెప్పేదొకటి.. చేసేదొకటి!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ధాన్యం విక్రయాలకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం చేసే ప్రకటన ఒకటి.. క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటిగా ఉంది. యంత్రాంగం తీరుపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో రైతుకు నచ్చిన మిల్లును ఎంచుకొని.. ట్రక్ షీట్ తీసుకొని తరలించడంతోపాటు వెంటనే డబ్బులు కూడా పొందేవాడు. రవాణా చార్జీలు కూడా మిల్లర్లు భరించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సుమారు పది రోజులుగా ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పులు వారిని మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాలు పడుతున్నా.. అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండడంతో రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
స్వయంగా ఎండీ చెప్పినా...
పౌర సరఫరాల సంస్థ ఎండీ మనజిర్ జిలాని సమూన్ సీతానగరం మండలంలో ఈ నెల 4న పర్యటించారు. రైతులు ధాన్యాన్ని తమకు దగ్గరలో ఉన్న మిల్లుకు తరలించవచ్చని స్పష్టం చేశారు. అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో జరుగుతోంది. దూర ప్రాంతంలో ఉన్న మిల్లులకు ట్రక్ షీట్ ఇవ్వడంతో లబోదిబోమంటూ తన సొంత ఖర్చులు పెట్టుకుని వాహనంతో అక్కడికి తీసుకుని వెళుతున్నాడు. ఒక్కొక్క బస్తాకు రూ.30 నుంచి రూ. 40 వరకూ రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. కొంతమంది మిల్లర్లు సరిపడా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వకపోవడం వల్ల.. పూర్తి స్థాయిలో అధికారులు వారికి ధాన్యం ఇవ్వడం కుదరడం లేదు. దీంతో సమీప ప్రాంతాల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. సీతానగరం మండలం నుంచి రైతులు ధాన్యాన్ని పార్వతీపురం, బలిజిపేట ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళుతున్నారు. ఈ బాధలు పడలేక దళారులకు తక్కువ ధరకే ఇచ్చేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోలులో ఆంక్షలు
అమలు కాని నిబంధనలు
సొంత ఖర్చుతోనే తరలిస్తున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment