బిళ్లలవలసలో డయేరియా
బొండపల్లి: మండలంలోని బిళ్లలవలస గ్రామం డయేరియాతో మంచంపట్టింది. మూడు రోజుల వ్యవధిలో 16 మంది డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎనిమిది మంది వివిధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతుండగా, మరో ఎనిమిది మంది గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరంలో సేవలు పొందుతున్నారు. ఈ నెల 17న పత్తిగుళ్ల దీపికకు డయేరియా లక్షణాలు కనపడడంతో విజయనగరంలోని ఘోష ఆస్పత్రికి తరలించారు. అదే రోజు పత్తిగుళ్ల రాజశేఖర్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి, వెంపడాపు పైడితల్లిని జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. 18వ తేదీన రౌతు చరణ్ తేజ, సుంకరి అప్పలనాయుడు, ఇపర్తి సీతమ్మను, 20వ తేదీ ఉదయం నక్కాన పైడమ్మకు వాంతలు, విరేచనాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లారు. గ్రామంలో పలువురిలో డయేరియా లక్షణాలు కనిపించడంతో బొండపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఎల్.సత్యనారాయణ, సమీరాలు సచివాలయంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో సేవలందించారు. ఇంటింట సర్వే చేసి డయేరియా బాధిత లక్షణాలు ఉన్నవారికి సేవలందిస్తున్నారు. పత్తిగుళ్ల బంగారయ్య, గౌరి, అప్పారావు, పతివాడ సూర్యకళ, బూర అప్పయ్యమ్మ, రౌతు అప్పయ్యమ్మ, ఎర్రి యామిని, సుంకరి అప్పయ్యమ్మకు గ్రామంలోనే వైద్యసేవలందించారు. ఎలాంటి ప్రాణాపాయంలేదని, రోగులు కోలుకుంటున్నట్టు పీహెచ్‌సీ వైద్యులు తెలిపారు. కొందరు డిశ్చార్జ్ అయ్యారన్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే డయేరియా సోకినట్టు గుర్తించామన్నారు.
గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్‌ఓ
డయేరియా ప్రబలిన సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి జీవనరాణి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ రాణిలు గ్రామాన్ని సోమవారం సందర్శించారు. డయేరియా వ్యాప్తిపై ఆరాతీశారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. డయేరియా కట్టడిలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్లోరిన్ మాత్రలను ఇంటింటికి పంపిణీ చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని తాగునీటి పథకాలు, కాలువలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న రోగిని పరామర్శించి రోగి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఆరు బయటే వైద్యం
మూడు రోజుల వ్యవధిలో
వ్యాధిబారినపడి 16 మంది అస్వస్థత
వీరిలో 8 మందికి వివిధ ఆస్పత్రుల్లో వైద్యసేవలు
కలుషిత ఆహారమే కారణమని తేల్చిన వైద్యులు
గ్రామంలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రోగులకు సరైన సౌకర్యాలు కల్పనలో వైద్యసిబ్బంది విఫలమయ్యారు. ఆరుబయటే రోగులకు వైద్యసేవలు అందించడంపై గ్రామస్తులు మండిపడ్డారు. పెంట కృష్ణమ్మ, ఎర్రి యామిని తదితరులు తమ ఇంటి నుంచి తెచ్చుకున్న మంచంపైనే సచివాలయం బయట వైద్యసేవలు పొందారు. డయేరియా వ్యాప్తితో ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు అప్రమత్తమయ్యారు. తాగునీటి పథకాన్ని క్లోరినేషన్ చేయడంతో పాటు, కాలువల్లో బ్లీచింగ్ చల్లి, పూడికలను తొలగించారు. తాగునీటి శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్టు ఎంపీడీఓ గిరిబాల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment