మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గిరిపుత్రుల సత్తా
శృంగవరపుకోట: జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన గిరిజన క్రీడాకారులు సత్తా చాటి పతకాల పంట పండించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకూ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లా కున్నంకులం గ్రామంలోని ప్రభుత్వ బాలుర హై సెకండరీ స్కూల్‌లో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా గిరిజన క్రీడాకారులు 3 స్వర్ణం, 7 రజతం, 9కాంస్య పతకాలు సాధించారని కోచ్ చాపా రామచంద్రరావు చెప్పారు. ఉద్యోగాలు లేక ఉపాధి కోసం వేర్వేరు వృత్తులు చేసుకుంటూ ఆటపై మక్కువతో వచ్చి పతకాలు పండిస్తున్న గిరిపుత్రులను ప్రభుత్వాలు, లేదా ప్రైవేట్ క్రీడా సంస్థలు ఆర్థికంగా ఆదుకుని, అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. 2004లో గిరిజన క్రీడాకారులు 45 పతకాలు సాధించి ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్ 2వ స్థానం సాధించారని, 2000లో మహిళలు ఆల్‌రౌండ్ చాంపియన్ షిప్ సాధించారని వివరించారు. ఇటీవల జరిగిన పోటీల్లో పి.జయరాం 10కి.మీ పరుగులో రజతం, 1500మీ పరుగులో కాంస్యం, పి.కిశోర్ 5కి.మీ నడకలో స్వర్ణం, పి.కోటేశ్వరరావు పోల్‌వాల్ట్‌లో కాంస్యం, పి.దొరబాబు హైజంప్‌లో కాంస్యం, కె.రాంప్రసాద్ 5కి.మీ వాకింగ్‌లో వెండి. ఎం.శ్రీరాములు 5కి.మీ వాకింగ్‌లో కాంస్యం, కె.కన్నారావు లాంగ్‌జంప్‌లో వెండి, హైజంప్‌లో కాంస్యం, 100మీ రన్‌లో కాంస్యం, ఎన్.చంద్రరావు 400మీ రిలేలో వెండి పతకం, 110మీ హర్డిల్స్‌లో కాంస్యం, కె.నరేష్ హర్డిల్స్‌లో కాంస్యం, కె.సోమునాథ్ 100మీలో కాంస్యం, పి.మంగళ్లు 200మీ లో వెండి పతకాలు సాధించారని కోచ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment