నేడు జీడి తోటల ఫలసాయానికి వేలం
వీరఘట్టం: మండలంలోని వండవ గ్రామ పరిధి లోని 150 ఎకరాల జీడి తోటల ఫలసాయం పొందేందుకు ఈ నెల 5న ఉదయం 11 గంటలకు పార్వ తీపురం అటవీశాఖ కార్యాలయంలో వేలంపాటు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీశాఖ అధికారి జి.ఎ.పి.ప్రసూన ఉత్తర్వులు జారీచేశారు. గత రెండేళ్లుగా అటవీశాఖ అధికారులే తోటల సస్యరక్షణ, పంటల విక్రయం చేపట్టారు.
తోటల విస్తరణ ఇలా...
వండువ కొండల్లో 1980లో 62.5 ఎకరాల్లో జీడి తోటలు వేశారు. మరలా 1982లో 87.5 ఎకరాల్లో జీడితోటలు సాగుచేశారు. మొత్తం 150 ఎకరాల్లో సుమారు 3,750 జీడి మొక్కలను వేశారు. మొక్కలు వేసిన ఐదేళ్లు తర్వాత ఫలసాయం బాగా వచ్చింది. అటు అటవీశాఖకు 40 శాతంమేర, గ్రామ పంచాయతీకి 60 శాతం మేర ఆదాయం సమకూరేది. కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, ఈదురుగాలుల దాటికి వీటిలో రెండు వంతుల చెట్లు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం 1302 జీడి చెట్లు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ చెట్ల ఫలసాయానికి మాత్రమే వేలం పాట నిర్వహించనున్నారు. చెట్ల సంఖ్య తగ్గడంతో ఆదాయం తగ్గుతోందని, జీడిమామిడి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీ వాసులు కోరుతున్నారు.
వేలం పాట నిబంధనలివే....
● వేలం పాటలో తోటలు లీజుకు వెళ్లకపోతే మరలా ఫిబ్రవరి 15న వేలం పాట నిర్వహిస్తారు. అప్పటికీ వేలం జరగకపోతే ఫిబ్రవరి 30న మరోసారి వేలం పాట నిర్వహిస్తారు.
● వేలం పాటలో పాల్గొనే వారు ముందుగా వారు పాడబోయే తోటలను చూసుకోవాలి.
● ప్రతీ పాటదారు ధరావత్తు సొమ్ము రూ.5000 తో పాటు రూ.25వేలు నగదు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలి.
● పాట ముగిసిన వెంటనే నగదు సాల్వెన్సీ కాకుండా ధరావత్తు సొమ్ముతో కలపి 1/3 వంతు అదేరోజు చెల్లించాలి.
● పాట ఖరారైన వ్యక్తికి పాన్‌కార్డు, ఆధార్‌కార్డు కలిగి ఉండాలి.
వేలం పాట పక్కాగా నిర్వహిస్తాం
జీడి తోటల ఫలసాయానికి నిర్వహించిన వేలంలో గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా పక్కాగా నిర్వహిస్తాం. వేలంను సింటికేట్ చేస్తే ఆ వేలంను రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ఎవరైనా లోపా యికారిగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– జీఏపీ ప్రసూన, డీఎఫ్‌ఓ,
పార్వతీపురం మన్యం జిల్లా
జీవో విడుదల చేసిన జిల్లా అటవీశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment