ఆంగ్లమాధ్యమానికే ఓటు
విజయనగరం అర్బన్:
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లమాధ్యమం చదువులకే ఆసక్తి చూపుతున్నారు. పదోతరగతి పరీక్షలను ఆంగ్లమాధ్యమంలో రాసేందుకు అధికమంది టిక్ పెట్టారు. కూటమి ప్రభుత్వ ఆంగ్లమాధ్యమ నిర్వీర్య యత్నాలను తిప్పికొట్టారు. పేదకుటుంబాల పిల్లలు అంతర్జాతీయ అవకాశాలు అందుకునేలా గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రాథమిక విద్య నుంచే సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమల్లోకి తెచ్చింది. కార్పొరేట్ స్కూల్స్‌ను తలదన్నేలా సర్కారు బడికి ఆధునిక హంగులు అద్ది సీబీఎస్‌ఈ సిలబస్ బోధనకు శ్రీకారం చుట్టింది. బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు అందజేసింది. ఊరి బడికి ఓ కొత్త వెలుగును తెచ్చింది. అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యపై నిర్లక్ష్యం అలముకుంది. ఆంగ్లమాధ్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు పూనుకుంది. ఈ దశలో సీబీఎస్‌ఈ సిలబస్ బోధనకు మంగళం పాడేసింది. పదోతరగతి పరీక్షలను తెలుగులోనూ రాసుకోవచ్చని ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల విద్యార్థులపై ఒత్తిడి చేసింది. అయితే తెలుగులో పరీక్షలు రాసేందుకు విజయనగరం జిల్లాలో కేవలం 9 శాతం మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 22 శాతం మంది విద్యార్థులు మాత్రమే ముందుకు వచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను తెలుగు మీడియంలోకి మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పదో తరగతి విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పినట్లయింది.
91 శాతం మంది ఆంగ్ల మాధ్యమంవైపే..
పదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మీడియానికే జై కొట్టారు. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 91 శాతం మంది ఇంగ్లిష్ మీడియంలోనే రాస్తామని ఆప్షన్ ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరం పదో తరగతిలో మొత్తం 33,292 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరంతా మార్చి 17 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ నామినల్ రోల్స్ పంపాల్సిందిగా పాఠశాలలను ఆదేశించింది. ఈ ప్రక్రియ మొదలైన అనంతరం తెలుగులోనూ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని, తెలుగు మీడియంలో పరీక్షలు రాసేందుకు కూడా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే, ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా.. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల నుంచి కేవలం 4,508 మంది మాత్రమే తెలుగు మీడియంకు దరఖాస్తు చేసుకున్నారు. విజయనగరం జిల్లాలోని 22,928 మందిలో 9.4 శాతంతో 2,163 మంది, పార్వతీపురం మన్యంలో 10,364 మందిలో 22.6 శాతంతో 2,343 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య కేవలం 3,500 మించి ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంస్కరణలతో 2023–24 విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఇంగ్లిష్ మీడియం పూర్తి స్థాయిలో లేకున్నా మెజార్టీ విద్యార్థులు స్వచ్ఛందంగా ఇంగ్లిష్ మీడియంను కోరుకొని పరీక్షలు రాశారు. గత స్రభుత్వ ఆదేశాల అమలు ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో పదోతరగతి ఇంగ్లిష్ మీడియంలోకి మారింది. అయినప్పటికీ కూటమి సర్కారు ఇంగ్లిష్ మీడియం రద్దుకు కంకణం కట్టుకుని పదోతరగతి విద్యార్థులను తెలుగు మీడియం వైపు తిప్పేందుకు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
టెన్త్ తెలుగు మీడియం పరీక్షలపై మక్కువచూపని విద్యార్థులు
విజయనగరం జిల్లాలో 9 శాతం, మన్యం జిల్లాలో 22 శాతం మంది మాత్రమే తెలుగు మాధ్యమానికి ఆప్షన్
కూటమి కుట్రను తిప్పి కొట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment