పనిచేయని ‘కూటమి’ పాచికలు
● పాలకొండలో పట్టువీడని వైఎస్సార్‌సీపీ నాయకులు
● నగరపంచాయతీ చైర్మన్ ఎన్నికలో ఎత్తుకుపైఎత్తు
● కోరం లేక నిలిచిన చైర్మన్ ఎన్నిక
● తెల్లారిసరికే మంత్రితో సహా పాలకొండలో మకాం వేసిన కూటమి నేతలు
● చైర్మన్ ఎన్నిక నిలిచిపోవడంతో వెనుదిరిగిన వైనం
పాలకొండ:
కూటమిది అధికార బలం... వైఎస్సార్‌సీపీ ది కౌన్సిలర్ల బలం... ఈ రెండింటి మధ్య పాలకొండ నగరపంచాయతీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు తెరతీసింది. సంఖ్యాబలం లేకపోయినా నగర పంచాయతీ చైర్మన్ కుర్చీని తన్నుకుపోవాలన్న కూటమి నాయకుల యత్నాలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఐక్యత, ఆలోచనతో చెక్‌పెట్టారు. ప్రలోబాలకు లొంగకుండా ఐక్యతా రాగం వినిపించారు. కోరం చాలక మంగళవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక నిలిచిపోవడంతో తెల్లారిసరికే పాలకొండ వేదికగా పావులు కదిపిన అధికార పార్టీ నేతలు కంగుతిన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రలోభాలు పనిచేయవని, ఓటే వజ్రాయుధమన్న విషయం తెలిసొచ్చింది.
పాలకొండలో ఉత్కంఠ
నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక సోమవారం పలు నాటకీయ పరిణామాల మధ్య మంగళవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నికపై అంతటా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఉదయం 10 గంటల నుంచి చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కౌన్సిలర్లు హాజరైతే వారి హాజరును పరిగణనలోకి తీసుకుని ఎన్నిక నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 11.40 గంటలకు స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనలో చేరిన మరో కౌన్సిలర్‌తో కలిపి నలుగురు సభ్యులు మాత్రమే ఎన్నిక కోసం హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల కోసం అందరూ ఎదురుచూశారు. ఎవరూ హాజరు కాకపోవడంతో కోరం లేక చైర్మన్ ఎన్నిక నిలిపివేస్తున్నట్లు ఎన్నికల అధికారి యశ్వంత్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇక్కడ పరిస్థితిని కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులకు తెలియజేశామని, ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కూటమి నేతలకు భంగపాటు
అధికారం ఉంది కదా.. చైర్మన్ పదవి ఎలాగైనా లాక్కుందామనుకున్న కూటమి నాయకులకు చివరకు భంగపాటు తప్పలేదు. చైర్మన్ ఎన్నికకు సోమవారం నామినేషన్లు స్వీకరిస్తున్నప్పుడు 2వ వార్డు కౌన్సిలర్ ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరష్కరించడం, వైఎస్సార్‌సీపీ నాయకులు విప్ జారీ చేయడం తదితర పరిణామాలతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మంగళవారం ఆ పదవిని దక్కించుకుందామని తెల్లవారేసరికి మంత్రి సంధ్యారాణితో సహా స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణ, కూటమి నాయకులు పాలకొండను చుట్టుముట్టారు. ఈ సారి కూటమి నాయకులు చైర్మన్ పదవి దక్కించుకుంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, ఈ ఎన్నికకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు హాజరకాకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలిచిపోవడంతో కూటమి నాయకులు కంగుతిన్నారు. తీవ్ర అసంతృప్తితో నగరపంచాయతీ కార్యాలయం నుంచి వెనుదిరిగారు.
గట్టి బందోబస్తు
పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ కుర్చీ కోసం కూటమి నాయకులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడంతో ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయోనని పోలీసు గట్టి బందోబస్తు ఏర్పా టు చేశారు. పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ఎం.చంద్రమౌళి, ఐదుగురు ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించారు. జిల్లా ఇంటిలిజెన్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని ఏం జరుగుతుందోనని ఆరా తీశారు.
నాటకీయ పరిణామాల మధ్య చైర్మన్ ఎన్నిక నిలిచిపోవడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment