రాములోరి పెళ్లికి పందిరిరాట
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానంలో ఈ నెల 8న జరగనున్న స్వామివారి తిరుక్కల్యాణ మహోత్సవానికి అర్చకులు అంకురార్పణ చేశారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద మంగళవారం ఉదయం పందిరిరాట కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా స్వామివారికి వేకువజామున సుప్రభాతసేవ, బాలభోగం అయిన తరువాత రామస్వామివారి సన్నిధిలో విస్వక్సేన పూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలను నిర్వహించారు. పందిరరాట అనంతరం వెండి మండపం వద్ద శ్రీరాముడిని పెళ్లి కుమారుడిగా అలంకరించి విశేష పూజలు చేశారు.
ఆలయం వద్దకు చేరిన రథం
స్వామివారి రథయాత్ర మహోత్సవం ఈ నెల 11న రాత్రి 10 గంటలకు జరగనుంది. ఏటా ఆనవాయితీగా సీతారామునిపేట గ్రామానికి చెందిన భక్తులు రథాన్ని ఆలయం వద్దకు తీసుకువస్తుంటారు. ఈ నేపథ్యంలో సీతారామునిపేట గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీరామనామాన్ని జపిస్తూ స్వామివారి రథాన్ని ఊరేగింపుగా దేవాలయం వద్దకు మంగళవారం తీసుకువచ్చారు. ఇక్కడే రథయాత్రకు రథాన్ని ముస్తాబు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment