పెద్దపల్లి: ఈ ఏడాది చివరన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంటతో అన్ని వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు అధికార పార్టీ కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా కుల, చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో శ్రీబీసీబంధుశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా వచ్చే రూ.లక్ష సాయంతో ఆయా కులవృత్తుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచించింది.
అయితే క్షేత్రస్థాయిలో తొలివిడత సాయం పంపిణీలో నేతల అనుచరుల కమీషన్లతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హుల జాబితాలో పేరు ఉన్నా.. కమీషన్ ఇవ్వనిదే చెక్కు ఇవ్వని పరిస్థితి నియోజకవర్గాల్లో నెలకొందని సాయం పొందినవారే ఆరోపిస్తున్నారు. మలివిడతలోనైనా కమీషన్లు, నేతల సిఫారసులు లేకుండా పూర్తి సాయం అందేలా చూడలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రూ.10వేలు ఇవ్వాల్సిందే..
విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, శాలివాహన, కుమ్మరి, మేదరి తదితర 14 కులాలు, ఏంబీసీ కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు జూన్ 6నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుదారులకు తెల్లరేషన్‌కార్డు, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ పరిధిలో రూ.2లక్షలు ఉండాలనేది నిబంధన. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నిబంధనలకు లోబడి ఉన్న వారిని గుర్తించాలి.
ఇలా జిల్లాలో మొత్తం 10,759మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,765 మందిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 8,683 మందిని అర్హులుగా తేల్చారు. అందులో తొలివిడుతలో భాగంగా పెద్దపల్లి, రామగుండంలో 300 మందికి, మంథనిలో 180, ధర్మారంలో 65 మందిని తొలివిడత ఎంపిక చేశారు. అయితే తొలివిడతలోనే తమ అనుచరులకు చోటుకల్పించాలనే ఆలోచనతో నేతలు, వారి అనుచరుల సిఫారసుకు అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది.
దీంతో ఇదే అదునుగా తమ బంధువులు, అనుచరులు, లేదా రూ.10నుంచి 15వేలు కమీషన్ ఇచ్చిన వారికే తొలివిడతలో చోటు కల్పించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా లేనివారి పేర్ల స్థానంలో ఆర్థికంగా బాగున్న వారి పేర్లతో జాబితా ఉండటంపై దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి వివరణ కోరగా నిబంధనల మేరకే.. మంత్రి ఆమోదంతోనే ఎంపికచేశామని తెలిపారు. దళారులకు డబ్బులు ఇవ్వద్దొని, అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు.
అభివృద్ది నేను చూసుకుంటా..
జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చుట్టూ నిత్యం తిరిగే ఓ ఎంపీపీ భర్త ప్రభుత్వం బీసీల్లోని కులవృత్తులకు అందించే రూ.లక్ష సాయం ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10వేలు కమీషన్ తీసుకున్నట్లు సమాచారం. సాయానికి ఎంపికై న ఓ లబ్ధిదారుడు కమీషన్ ఇవ్వకపోవడంతో అతడి చెక్కు పంపిణీ కాకుండా అడ్డుకోవడంతో అతడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. చెక్కు ఇచ్చాడన్న ఆరోపణలు వస్తున్నాయి.
రామగుండం కార్పొరేషన్ పరిధిలో రూ.లక్ష సాయానికి అర్హుల జాబితాలో ఏకంగా కార్పొరేటర్ భర్త పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో రామగుండం పరిధిలో కొంతమంది కార్పొరేటర్లు వారి బంధువులకే దళితబంధు ఇప్పించుకున్నారనే విమర్శలున్నాయి. తాజాగా ఈ లక్ష రూపాయల సాయంలోనూ బంధువులు, లేదా కమీషన్ ఇచ్చినవారికే ఇప్పిస్తామంటూ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment