మూడు పార్టీల్లో పోటీ.. | - | Sakshi
Sakshi News home page

మూడు పార్టీల్లో పోటీ..

Published Mon, Nov 18 2024 12:54 AM | Last Updated on Mon, Nov 18 2024 12:54 AM

-

కాంగ్రెస్‌లో బహుముఖ పోటీ నెలకొంది. ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి, ఎంపీ కంటెస్టెంట్‌ వెలిచాల రాజేందర్‌ రావు మధ్య గట్టిపోటీ నడుస్తోంది. వీరిద్దరూ తమకు టికెట్‌ కేటాయించాలని ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. ఇటీవల నరేందర్‌రెడ్డికి ఒకసారి ఢిల్లీ నుంచి మరోసారి పీసీసీ చీఫ్‌ నుంచి ఆహ్వానాలు రావడం గమనార్హం. 1,50,000 మందితో ఆయన ఓటర్‌ ఎన్‌రోల్‌మెంట్‌, 42నియోజకవర్గాల్లో పర్యటనలు, 71 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రత్యేక యాప్‌ తదితరాలతో ప్రచారంలో అందరి కన్నా ముందున్నారు. వెలిచాల రాజేందర్‌రావు కూడా గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. తన రాజకీయ నేపథ్యం, యువత, నిరుద్యోగుల విషయంలో తనకున్న వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు కూడా వీరిద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తాజాగా మరో అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు.

● బీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ ముందు నుంచి తానే గులాబీ పార్టీ అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్‌రోల్‌మెంట్‌ ముగిసిన దరిమిలా.. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. బీఎన్‌.రావు ఉమ్మడి నాలుగు జిల్లాల్లో వరుసగా పర్యటిస్తున్నారు. రావుఫౌండేషన్‌, ఐఎంఏలో తాను చేసిన సేవలు గెలిపిస్తాయని నమ్ముతున్నారు. యాదగిరి శేఖర్‌రావు కూడా గులాబీ పార్టీటికెట్‌ ఆశిస్తున్నారు. పార్టీతో పనిలేకుండా తన ప్రచారం తాను చేసుకుపోతున్నారు. టికెట్‌ వచ్చినా రాకున్నా.. ఈ ముగ్గురు స్వతంత్రులుగానైనా బరిలో నిలవనున్నారు.

● బీజేపీ నుంచి పొల్సాని సుగుణాకర్‌రావు, మంచిర్యాలకు చెందిన రఘుపతి, రాణీరుద్రమ తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు. ఇండిపెండెంట్లు సైతం భారీగానే బరిలో ఉన్నారు. మాజీ డీఎస్పీ గంగాధర్‌, లక్ష్య్‌ విద్యాసంస్థల అధినేత ఎండీ.ముస్తాఖ్‌అలీ, డాక్టర్‌ హరికృష్ణారెడ్డి తదితరులు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. తమ పార్టీ నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆయా అభ్యర్థుల బలబలాలు, సామర్థ్యాలను క్షేత్రస్థాయిలో రహస్య సర్వేల ద్వారా అంచనావేసి త్వరలోనే ప్రధాన పార్టీలు ఓ నిర్ణయానికి రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement