ఎవరి బలం ఎంత?
‘ఎమ్మెల్సీ’ కోసం పార్టీల సర్వే
● అభ్యర్థుల బలాబలాలపై రహస్యంగా సమాచార సేకరణ ● ఇప్పటికే పూర్తయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ● ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న అభ్యర్థులు ● ప్రధాన పార్టీలు, ఇండిపెండెంట్లలో పెరుగుతున్న పోటీ
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థులు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చితో ముగియనుండటంతో రాజకీయపార్టీలు కూడా అభ్యర్థుల బలా బలాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సొంతపార్టీ నేతలతోపాటు పలు ప్రైవేటు ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. తొలుత అభ్యర్థుల అంగబలం, అర్ధబలం ప్రామాణికంగా తీసుకుంటున్న పార్టీలు, తరువాత నాయకుడి చరిష్మా, రాజకీయ నేపథ్యం, గతంలో నిర్వహించిన పదవులు, ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు రహస్యంగా నియమించుకున్న పలు బృందాలు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్థానంలోని పలు నియోజకవర్గాల్లో తిరుగుతున్నాయి.
కాంగ్రెస్.. బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీల్లో బహుముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్– బీఆర్‌ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని హస్తంపార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఉద్యమఖిల్లాగా పేరొందిన కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానాన్ని సొంతం చేసుకుంటే తమ పార్టీకి ఇక్కడ తిరిగి పట్టు చిక్కుతుందన్న పట్టుదలతో బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. అదే సమయంలో పట్టభద్రుల స్థానంలో ఈ సారి సత్తా చాటాలని బీజేపీ సైతం అదే స్థాయిలో ఆశలు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment