భయం వద్దు
● హెచ్‌ఎంపీవీ ప్రమాదకరం కాదు
● అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి
● శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌వో డాక్టర్ అన్నప్రసన్న కుమారి
కోల్‌సిటీ(రామగుండం): ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్‌ఎంపీవీ).. మన దేశంలోనూ ఆ వైరస్ బారిన పడిన కేసులు వెలుగు చూస్తుండడంతో అందరినీ భయాలకు గురి చేస్తోంది. కోవిడ్–19 వైరస్ అనుభవాల నుంచి తేరుకోని ప్రజలను ఈ హెచ్‌ఎంపీవీ ఆందోళన కలిగిస్తోంది. కానీ ఈ వైరస్ ప్రమాదకరమైనది కాదని, ఇది పాత వైరస్సేనని, ఎవరూ ఆందోళనకు గురికావద్దని డీఎంహెచ్‌వో డాక్టర్ జి.అన్నప్రసన్నకుమారి సూచించారు. హెచ్‌ఎంపీవీపై భయాలు, అపోహలకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే అసలు ఈ వైరస్ బారినపడకుండా ఉండొచ్చని పేర్కొన్నారు. గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.
సాక్షి: కోవిడ్ తరహ ప్రమాదకరమా..?
డీఎంహెచ్‌వో: హెచ్‌ఎంపీవీ వైరస్ కోవిడ్‌లా కొత్త వైరస్ కాదు. ఈ వైరస్ పాతదే. కానీ, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. పాణాపాయం ఏర్పడే అవకాశం ఉండడదు. చలికాలంలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
సాక్షి: తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
డీఎంహెచ్‌వో: వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. మాస్క్ ధరించాలి. షేక్‌హ్యాండ్ చేయకూడదు. తుమ్మినా, దగ్గినా నోటికి అడ్డంగా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు వాడే మందులను నిల్వ ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. వేడి వేడి ఆహారాన్ని తినాలి. మూడు రోజులైనా జలుబు, దగ్గు, జ్వరం తగ్గకపోతే వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చూపించాలి.
సాక్షి: వైరస్ ఎలా వ్యాపిస్తుంది..?
డీఎంహెచ్‌వో: ఈ వైరస్ సోకినవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే.. ఎలాంటి వైరస్‌లు, అంటు వ్యాధులు దరిచేరవు.
సాక్షి: జిల్లాలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
డీఎంహెచ్‌వో: జిల్లాలోని 18 పీహెచ్‌సీలు, 7 అర్బన్ హెల్త్ సెంటర్లు, 4 బస్తీ దవాఖానాలు, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని పీహెచ్‌సీలతోపాటు గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలో వైద్యులను అప్రమత్తం చేశాం. ఇప్పటికే ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం కలిగిన వార్డులు, సరిపడా మందులు కూడా ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు వైరస్ ప్రభావం లేదు. భయాందోళన చెందవద్దు.
సాక్షి: ఈ వైరస్‌తో ఎవరికై నా ప్రమాదమా..?
డీఎంహెచ్‌వో: బ్రాంకై టిస్, న్యూమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. చలికాలం కాబట్టి మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
సాక్షి: లక్షణాలు ఎలా ఉంటాయి..?
డీఎంహెచ్‌వో: హెచ్‌ఎంవీపీ బారిన పడినవారిలో ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు, జ్వరం, ముక్కు కారడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలుంటాయి. వైరస్ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే బ్రాంకై టిస్, న్యూమోనియాకు దారి తీస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment