రాని పూత.. రైతన్న వెత | - | Sakshi
Sakshi News home page

రాని పూత.. రైతన్న వెత

Published Fri, Jan 10 2025 1:20 AM | Last Updated on Fri, Jan 10 2025 1:20 AM

రాని

రాని పూత.. రైతన్న వెత

● మూడేళ్లుగా మామిడి దిగుబడి కరువు ● ఈసారీ చెట్లపై కనిపించని పూత ● అక్కడక్కడ వచ్చినా ఆశిస్తున్న తేనె మంచు పురుగు ● 80వేల ఎకరాల్లో మామిడి తోటలు

జగిత్యాల అగ్రికల్చర్‌: ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు మామిడిపంటకు ప్రతిబంధకంగా మారాయి. నవంబర్‌, డిసెంబర్‌, జనవరి నెలల్లో రావాల్సిన మామిడిపూత ఇప్పటికీ కనిపించడం లేదు. అక్కడక్కడ వచ్చినా తేనెమంచు పురుగు ఆశిస్తోంది. రెండు, మూడేళ్లుగా మామిడిపంట దిగుబడి సరిగా రావడం లేదు. ఈ ఏడాదైనా వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జగిత్యాల జిల్లాలోనే 35 వేల ఎకరాల్లో..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపు 80వేల ఎకరా ల్లో మామిడి తోటలున్నాయి. జగిత్యాల జిల్లాలోనే 35వేల ఎకరాల్లో విస్తరించాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున 4 లక్షల మె.ట. మామిడి దిగుబడి వస్తుందని అంచనా. సీజన్‌లో ధర టన్నుకు తక్కువలో తక్కువ రూ.30వేల నుంచి రూ.40 వేలు పలుకుతుంది. సాధారణ పంటలైన వరి, మొక్కజొన్నకు పెట్టుబడులు పెరిగిపోవడం, కూలీలు దొరక్కపోవడంతో రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. జగిత్యాల, కరీంనగర్‌లలో మార్కెట్లు ఉండటం, ప్రధాన రోడ్ల వెంట మామిడిని ఎక్కడికక్కడే కొనుగోలు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. వ్యాపారులు ఢిల్లీ, నాగ్‌పూర్‌లకు తరలి స్తుండటంతో మంచి రేటు వస్తుందని ఆశపడ్డారు.

పొడి వాతావరణం ఉండాలి..

మామిడి పూత సాధారణంగా నవంబర్‌ చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్‌, జనవరి వరకు వస్తుంటుంది. పూత ఆలస్యమైనకొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి, పూత, పిందెలు రాలిపోతుంటాయి. ఏప్రిల్‌, మే నెలల్లో వచ్చే వడగాలులకు కాయలు రాలిపోతుంటాయి. అయితే, కొన్ని నెలలుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలతోపాటు తేమశాతం పెరగడం, చలి ప్రభావంతో మొగ్గలు బిగుసుకుపోయి, సరిగా విచ్చుకోవడం లేదు. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో రాత్రివేళల్లో కురిసే మంచు కూడా పూతపై ప్రభావం చూపుతోంది. పూత నుంచి పిందె వచ్చే వరకు పొడి వాతావరణం ఉండాలి. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదు.

ఆశిస్తున్న తేనె మంచు పురుగు

మూడేళ్లుగా మామిడికి పూత రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం, విపరీతంగా తేనెమంచు పురుగు ఆశిస్తుండటంతో మామిడి రైతుకు అనుకున్న దిగుబడి రావడం లేదు. దీంతో, కొంతమంది ఇప్పటికే తోటలను తొలగించగా, మరికొందరు ఈ ఏడాది పంట దిగుబడిని బట్టి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. పూతకు ముందుగానే తెగుళ్లు, పురుగులు ఆశించకుండా మామిడి తోటల్లో ఒక్కో రైతు కనీసం ఎకరాకు రూ.20వేల విలువైన రసాయన ముందులు పిచికారీ చేయిస్తున్నారు. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా పూత రావడం, వచ్చినా నిలవడం కష్టమవుతోంది.

అధిక వర్షాలు పెద్ద దెబ్బ

మామిడి చెట్లు పూతకు రావాలంటే బెట్ట పరిస్థితులు ఉండాలి. కానీ, గతేడాది సెప్టెంబర్‌ వరకు అధిక వర్షాలు కురిశాయి. భూమంతా తేమతో ఉంది. ఏటా కాయలు తెంపగానే, వర్షాకాలంలో చెట్లను ప్రూనింగ్‌(కొమ్మల కటింగ్‌) చేయిస్తే కొత్తగా వచ్చే కొమ్మలకు, రెమ్మలకు పూత వస్తుంది. జనవరి నెల సగానికి వచ్చినా పూత రాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, మామిడి పూతల సీజన్‌ రాగానే.. తోటల వెంట పరుగెత్తే లీజుదారులు ఈసారి వాటివైపే చూడటం లేదు.

ఎకరాకు రూ.20 వేలు ఖర్చు పెట్టా

మా మామిడి తోటలో ఇప్పటికే ఎకరాకు రూ.20 వేలు ఖర్చు పెట్టి, అన్ని యాజమాన్య పద్ధతులు పాటించాను. పురుగు మందులు పిచికారీ చేయించాను. గత మూడేళ్లలో పూత లేదు. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.

– కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి,

వెంకట్రావుపేట, మేడిపల్లి మండలం

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

తేమ వాతావరణం ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం మామిడి పూతపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడక్కడ వచ్చిన పూతను తేనెమంచు పురుగు ఆశించినందున రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

– పి.అరుణ్‌కుమార్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వ్యవసాయ కళాశాల, జగిత్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
రాని పూత.. రైతన్న వెత1
1/2

రాని పూత.. రైతన్న వెత

రాని పూత.. రైతన్న వెత2
2/2

రాని పూత.. రైతన్న వెత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement