సాక్షి, పెద్దపల్లి: సర్కార్ బడుల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినా కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నా.. మెనూ పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. ధరల పెరుగుదల, పెండింగ్ బిల్లులతో సాంబారు అన్నం పెడుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో నీళ్ల చారే దిక్కవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా పూర్తిస్థాయిలో మెనూ అమలు కావడం లేదు. పర్యవేక్షణ కొరవడి పరిస్థితి గాడి తప్పుతోంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఏజెన్సీలకు నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.
ధరలు పెరగడంతో..
జిల్లాలో 545 పాఠశాలలు ఉండగా, 45,697 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో రోజూ 40వేల మందికి పైగా మధ్యాహ్న భోజనం తింటున్నారు. అయితే చాలా చోట్ల వంట గదులు లేక ఆరుబయట వండుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు లేక కట్టెల పొయ్యి పై వండతుండటంతో అన్నం ఉడకడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలం కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడంతో ఇటీవల వాటి ధరలు కొండెక్కాయి. కూరగాయలు, నిత్యావసరాల ధరలు సైతం పెరిగాయి. దీంతో ఏజెన్సీలకు భారంగా మారుతుంది. అప్పులు చేసి వంట చేయాల్సి వస్తోంది. మెనూపై ధరల ప్రభావం పడుతుంది.
గుడ్డు లేని భోజనం
మెనూ ప్రకారం వారానికి మూడు గుడ్లు ఇవ్వాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ఒక్కో గుడ్డుకు రూ.5 ఇస్తుండగా, ప్రస్తుతం గుడ్డు ధర రూ.7కు చేరడంతో గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని పాఠశాలల్లో వారానికి రెండు గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. అలాగే ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటి నుంచి కోడిగుడ్ల బిల్లులు రావడం లేదని కార్మికులు వాపోతున్నారు. కొన్ని పాఠశాలల్లో దాతలు, టీచర్ల సహకారంతో అందజేస్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలుపై డీఈవో మాధవిని వివరణ కోరగా, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మధ్యాహ్న భోజనానికి ధరాఘాతం
వారంలో మూడు రోజులకు రెండు రోజులే గుడ్లు
అరకొర వసతుల నడుమే మధ్యాహ్న భోజనం
విడుదల కాని పెండింగ్ బిల్లులు.. అప్పుల్లో నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment