సాక్షి, హైదరాబాద్: ‘ప్రజా సంగ్రామ యాత్ర’పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తలపెట్టిన పాదయాత్రపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయస్థాయి ముఖ్యనేతలు పకడ్బందీ ఏర్పాట్లతో పాటు సునిశిత పర్యవేక్షణ మధ్య సాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. దేశంలో బీజేపీ ఎక్కడ పాదయాత్రలు చేపట్టినా ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఓ రోల్‌మోడల్ అయ్యేలా కమలనాథులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రకు సంబంధించి బీజేపీ అధిష్టానం పార్టీకి చెందిన ఐటీ, ఆర్ అండ్ డీ విభాగాల్లోని ఆరుగురు సభ్యుల ఉన్నతస్థాయి సాంకేతిక బృందాన్ని ఇప్పటికే రాష్ట్రానికి పంపించింది.
ప్రజలకు హత్తుకునేలా... తొలిదశలో 40 రోజుల పాటు సాగే ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యేలా పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజలకు హత్తుకునేలా పాదయాత్ర లక్ష్యాలు, దానికి సంబంధించిన ప్రోమోలు, వీడియోలు రూపొందిస్తున్నారు. పాదయాత్రలో పార్టీ ముఖ్యనాయకులతో సహా కార్యకర్తలు ఏమేరకు భాగస్వామ్యం అవుతున్నారు, లోటుపాట్లపై సాంకేతిక బృందం అమిత్‌షాకు, పార్టీ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్‌కు సమాచారాన్ని చేరవేయనున్నట్టు తెలుస్తోంది.
మిస్డ్‌కాల్‌తో కార్యకర్తల రిజిస్టర్... ఒక మిస్డ్‌కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకునే కార్యకర్తలకు సంజయ్‌తో కలసి పాదయాత్రలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. ఈ యాత్రకోసమే ప్రత్యేకంగా ఒక మొబైల్‌యాప్ తయారీ, పాదయాత్రకు సంబంధించిన వివరాలతో వెబ్‌పేజ్ వంటివి చేపడుతున్నారు.
బండి ప్రజా సంగ్రామ యాత్రపై ప్రణాళిక సిద్ధం చేస్తోన్న కమలనాథులు
పాపన్న స్ఫూర్తితో గడీల పాలన కూలగొడదాం: బండి
సర్దార్ సర్వాయి పాప న్న గౌడ్ బడుగు, బలహీనవర్గాల పాలిట ఆపద్బాంధవుడని, సమసమాజ స్థాపన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన యోధుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొనారు. సర్దార్ పాపన్న గౌడ్ 371వ జయంతి సందర్భంగా బుధవారం బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సర్దార్ పాపన్న ఆశయ సాధన కు అందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను చేపడుతున్న ‘ప్రజా సంకల్ప యాత్ర’కు గౌడ కులస్తులు, సబ్బండ వర్గాలు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. పాపన్న స్ఫూర్తితో దొరల గడీలు బద్దలు కొట్టి, అవినీతి కుటుంబ పాలనను అంతమొందిద్దామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment