విశ్వ నగరంలో విషం చిమ్ముతున్నారు | Sakshi
Sakshi News home page

విశ్వ నగరంలో విషం చిమ్ముతున్నారు

Published Fri, May 10 2024 4:50 AM

BRS candidates will not even get deposits in this election

15 సెకన్ల సమయమిస్తే మైనార్టీలను తుద ముట్టిస్తామని బీజేపీ మహిళా నేత అన్నారు 

ఆమెపై కేసు పెట్టి అరెస్టు చేయాలి..బీజేపీ నుంచి బహిష్కరించాలి 

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు 

జనజాతర సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విశ్వ నగరం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ మహిళా నేత ఒకరు (నవనీత్‌ రాణా) మాట్లాడుతూ 15 సెకన్లు సమయమిస్తే మైనార్టీలను తుద ముట్టిస్తామని అన్నారని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఆమెపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

 ఆమె విద్వేష పూరిత మాటలను బీజేపీ నేతలు సమర్థించని పక్షంలో పార్టీ నుంచి ఆమెను బహిష్కరించాలని అన్నారు. తాము అన్ని పండుగలు చేసుకుంటున్నామని, తమకు హిందూత్వం గురించి బీజేపీ వాళ్ళు నేర్పాలా? అని ప్రశ్నించారు. ప్రజలు కూడా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. గురువారం నర్సాపూర్, సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. 

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి 
‘లోక్‌సభ ఎన్నికలు మనకు జీవన్మరణ సమస్య. దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలి. రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం ఇండియా కూటమి అధికారంలోకి రావాలి. ఎన్నికలు రాగానే బీజేపీకి రాముడు, హన్‌మాన్‌ జయంతి.. బీఆర్‌ఎస్‌కు బతుకమ్మ పండగ గుర్తుకొస్తాయి.

 బిచ్చగాళ్లు అడుక్కున్నట్లుగా ఓట్లు అడుక్కునేందుకు రాముడిని, హనుమంతుడిని వాడుకుంటున్న బీజేపీని ఆ దేవుడు కూడా క్షమించడు. కేసీఆర్‌ను ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావు. బీఆర్‌ఎస్‌ పార్టీకి మెదక్‌లో ఒక్క మొనగాడు కూడా దొరక్క కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని తీసుకువచ్చి మెదక్‌లో పోటీ చేయిస్తున్నారు.  

మెదక్‌పై ఇందిరకుప్రత్యేక మమకారం 
దివంగత ప్రధాని ఇందిరాగాం«దీకి మెదక్‌ అంటే ప్రత్యేక మమకారం ఉండేది. ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించినప్పుడే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. బీడీఎల్, బీహెచ్‌ఈఎల్, ఓడీఎఫ్‌ వంటి ఫ్యాక్టరీలు వచ్చాయి. కానీ 1999 నుంచి 2024 వరకు మెదక్‌ నియోజకవర్గం బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేతుల్లో మగ్గి పోయింది. బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు వెంకట్రామ్‌రెడ్డి, రఘునందన్‌రావులను ఈ ఎన్నికల్లో ఓడించాలి. 

రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి. దేశంలో ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలి. పేద ప్రజల కోసం రాహుల్‌ గాంధీ జీవితాన్ని అంకితం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను ఇచ్చి ఆంధ్రలో, దేశంలో అధికారాన్ని త్యాగం చేసింది..’అని రేవంత్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement