సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు భగ్గుమన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డిగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. నిన్న ఘట్ కేసర్ లో అనిల్ కు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశమైంది. ఈనేపథ్యంలో అనిల్ కుమార్ రెడ్డి భువనగిరిలో సోమవారం కార్యకర్తలతో సమావేశమయ్యారు.
తనకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యతిరేకవర్గంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ దెబ్బతినేలా ఎంపీ వెంకట్‌రెడ్డి గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని అనిల్ ఆరోపించారు. ఆయన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నారని అన్నారు.
తన ఇంట్లోనే ఐదు ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తు రాలేదా? అని అనిల్ కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. పార్టీ పటిష్టంగా ఉంది, గెలిచే అవకాశాలు ఉన్న సమయం లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంచి సహకారం అందిస్తున్నారని కార్యకర్తల సమావేశంలో అనిల్ చెప్పుకొచ్చారు.
(బండి వ్యాఖ్యల సెగలు.. ఢిల్లీలో అమిత్‌షాతో కరీంనగర్ ఎంపీ భేటీ, కీలక సూచన)
కారెక్కనున్న కుంభం
కాంగ్రెస్‌లో వర్గపోరుతో కుంభం అనిల్‌కుమార్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డి సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని వార్తలు వెలువడుతున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డితోపాటు అనిల్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో కనిపించడం వార్తలకు బలం చేకూరింది.
(బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)
Comments
Please login to add a commentAdd a comment