సాక్షి, హైదరాబాద్: లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేపు షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.ఈ నేపథ్యంలో కోడ్ తక్షణం అమలులోకి రానుండగా.. అభ్యర్థుల ఖరారు.. ఎన్నికల ప్రచారాల హోరుతో ప్రధాన పార్టీలు రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కించబోతున్నాయి.
రేపు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండగా.. అదే సమయంలో ఏపీలో మరో ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అధికార వైఎస్సార్‌సీపీ మొత్తం 175 స్థానాలకు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఇలాగే ప్రకటించారు.
ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో వైఎస్సార్‌సీపీ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల ప్రభావం, అభ్యర్థుల గెలుపోటములపై నిర్వహించే సర్వేల ఆధారంగా.. ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మిగతా స్థానాల్లో కొన్నింట్లో సిట్టింగ్‌లకే అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా మార్పులు లేకుండా ఇప్పటికే పూర్తిస్థాయి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రేపు అధికారిక ప్రకటన వెలువడుతుండడంతో ఇటు వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరోసారి పొత్తు రాజకీయాన్నే నమ్ముకుంది. జనసేన, బీజేపీలతో కూటమిగా ఈ ఎన్నికలకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇప్పటికే సీట్ల పంపకంపై చర్చలు జరగ్గా.. అభ్యర్థుల్ని ప్రకటించడం కూటమిలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట్ల అసంతృప్తులు రాజీనామాలకు దిగుతున్నారు. ఆశావహులు, వాళ్ల వాళ్ల అనుచరులు.. పొత్తు అభ్యర్థికి సహకారం ఉండబోదని తెగేసి చెబుతున్నారు. వాళ్లను చల్లార్చేందుకు, బుజ్జిగించేందుకు ఆయా పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఇంకోపక్క తెలంగాణలో ఒంటరి పోరుకే మొగ్గు చూపిన బీజేపీ.. చిత్రంగా ఏపీలో మాత్రం టీడీపీ-జనసేనతో జట్టు కట్టింది. అయితే బీజేపీ పోటీ చేయబోయే స్థానాల్లో టీడీపీ, జనసేనల నుంచి సహకారం అనుమానంగానే కనిపిస్తోంది. ముందు ముందు ఇది మరింత రసవత్తరంగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా మూడు పార్టీల ఉమ్మడి సమన్వయ భేటీ జరగ్గకపోవడం గమనార్హం.
2019లో ఏడు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏపీకి మొదటి విడతలోనే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించింది ఈసీ. అదీ.. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో ఈసారి కూడా ఒకే విడుత.. అదీ తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment