Visakhapatnam: Minister Gudivada Amarnath Challenge To Chandrababu On Land Issue - Sakshi
Sakshi News home page

609 ఎకరాల్లో అరసెంటు భూమి ఉన్నా రాజకీయాలు వదిలేస్తా : మంత్రి అమర్నాథ్‌ సవాల్‌

Published Sat, May 20 2023 2:27 PM | Last Updated on Sat, May 20 2023 3:32 PM

Gudivada Amarnath Challenge To Chandrababu On Land Issue Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. 609 ఎకరాల్లో అరసెంటు భూమి తన పేరుపై ఉన్నా రాజకీయాలు వదిలేస్తానని చెప్పారు. ఎక్స్‌పరీ డేట్‌కు దగ్గరగా ఉన్న చంద్రబాబుకు తాను సవాల్‌ చేయనని తెలిపారు. మీరు నిరూపించకుంటే లోకేష్‌ను రాజకీయాల నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించారు.

నీ సవాల్‌ స్వీకరిస్తున్నా
 నా నియోజకవర్గంలోని విస్సన్నపేట భూములపై చంద్రబాబు నిన్న నాకో సవాల్‌ చేశాడు. దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధం. నీ మాదిరిగా, మేము ఎక్కడా భూములు కైంకర్యం చేయలేదు. నీ కొడుకు తోడల్లుడు గీతం వర్సిటీ పేరుతో భూమి కాజేశాడు.  నేను విస్సన్నపేటలో మాట్లాడిన చంద్రబాబు.. నేను 609 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపించాడు. నిజానికి అందులో 49 ఎకరాలు ఆనాడు రంగుబోలిగడ్డ రిజర్వాయర్‌ కోసం సేకరించిన చంద్రబాబు, రైతులకు పరిహారం కూడా ఇచ్చాడు. దీంతో 560 ఎకరాల భూమి ఉంది. అది ఎవరెవరివి అన్న జాబితా ఇది. ఇందులో 89 మంది రైతులు ఉన్నారు.

ఇదే నా సవాల్‌
609 ఎకరాల్లో ఒక సెంటు భూమి కానీ.. లేదా కనీసం అర సెంటు భూమి.. నా పేరు మీద కానీ, నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఉంటే.. నేను ఆక్రమించుకున్నట్లు కానీ,.. చూపితే.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నీ ఛాలెంజ్‌కు నేను రెడీ. నేను నీకు ఇప్పుడు ఛాలెంజ్‌ ఇస్తున్నాను. ఎందుకంటే నీవు రాజకీయాల్లో ఎక్స్‌పైరీకి దగ్గరగా ఉన్నావు. కాబట్టి నీ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించడానికి సిద్ధమా? నోరుంది కదా? అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు. నీలో శక్తి నశించింది. చివరకు మైక్‌ కూడా పట్టుకోలేకపోతున్నావు. ఇయర్‌ మైక్‌ వాడుతున్నావు. ఈ వయసులో ఎందుకంత దిగజారుడు రాజకీయం.

మా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది
నేను నీ మాదిరిగా, నీ కొడుకు మాదిరిగా దొడ్డిదారిలో పదవిలోకి రాలేదు. తరతరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మాకు ఎంతో చరిత్ర ఉంది. ఏనాడూ నా తాతగారు కానీ, నా తండ్రిగారు కానీ అనైతిక రాజకీయాలు చేయలేదు. అదే నీవు ఏనాడూ నీ తండ్రి పేరు చెప్పకోలేవు. నీ కొడుకు కూడా నీ తండ్రి పేరు చెప్పకుండా, ఎన్టీ రామారావు పేరే చెబుతాడు. నీ లాంటి అవినీతిపరుడు నోటికొచ్చినట్లు మాట్లాడి, ఆరోపణలు చేస్తే.. ఇక్కడి వారెవ్వరూ నమ్మబోరు.  నీవు ఇక్కడ పెట్టుబడుల సదస్సులు పెట్టావు. వాటి వల్ల రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా? కేవలం హోటల్‌ వాళ్లకు తప్ప. ప్రజలు అమాయకులు కాదు. ఇప్పటికే నీకు, నీ పార్టీకి ప్రజలు సమాధి కట్టారు. 2024లో వాటిపై రాళ్లు వేస్తారు. అందుకే ఇకనైనా వైఖరి మార్చుకొండి. పిచ్చి విమర్శలు, ఆరోపణలు మానండి.

చదవండి: 2 వేల నోట్ల రద్దు నిర్ణయం.. సరైనదా.. కాదా?

చంద్రబాబు నీచ నాయకుడు
విపక్షనేత చంద్రబాబు గౌరవ సీఎంగారిని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా, బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా వ్యవహరించడం ఎంత వరకు సబబు అనేది ఆయన ఆలోచించుకోవాలి.చంద్రబాబుకు రాష్ట్రం అన్నా, ప్రజలు అన్నా, సీఎంగారు అన్నా.. అందరిపైనా కోపం. ఎందుకంటే ఆయనకు ఓటేసి గెలిపించలేదు కాబట్టి.జగన్‌గారు సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగొద్దన్నది చంద్రబాబు ఆలోచన. అంత నీచంగా ఏ నాయకుడు కూడా ఉండబోడు.

ఎందుకా పగ? సమాధానం చెప్పు
అసలు చంద్రబాబు ఈ రాష్ట్రం మీద ఎందుకు పగబట్టాడు? దీనికి సమాధానం చెప్పాలి. మేము విపక్షంలో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేశాం. ప్రజల్లో ఉన్నాం. ఆనాటి సీఎం చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాం. అంతేతప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా, బ్రాండ్‌ ఇమేజ్‌ పోయే విధంగా వ్యవహరించలేదు. కానీ చంద్రబాబు అధికారం పోయినప్పటి నుంచి రోజూ అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నాడు.  నిన్న అనకాపల్లిలో కూడా చాలా అనుచితంగా మాట్లాడాడు. వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. కొన్నింటిపై మాట్లాడక తప్పదు. తన సభలో కొందరిని ముందుంచి, వారితో అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పించాడు. ఆ అవసరం ఏముంది?

మేము త్యాగం చేస్తే.. మీరు..
మేము అమరావతి రాజధాని కాదని చెప్పడం లేదు కదా? ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుతూ, అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉంటుందని చెప్పాం. మరి చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అన్నా, విశాఖపట్నం అన్నా ఎందుకంత కోపం? ఈ ప్రాంత ప్రజలు త్యాగాలు చేయాలా? అక్కడ అమరావతిలో చంద్రబాబు అండ్‌ కో భోగాలు, యోగాలు అనుభవిస్తారా? అమరావతిలో తమ భూముల విలువలు పడిపోకూడదన్నదే చంద్రబాబు అభిమతం. రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు చేసింది పూర్తిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం. ఇవాళ ఇక్కడికి వచ్చి, బుర్రకథలు చెబుతున్నారు. చంద్రబాబు నిర్ణయం నిజంగా సరైనదే అయితే, స్థానిక ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు, విజయవాడ, గుంటూరు నగరాల్లో టీడీపీ ఎందుకు చిత్తుగా ఓడిపోయింది.

మమ్మల్ని విమర్శించడమే మీ పని
 ఈ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. దాదాపు రూ.2.10 లక్షల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. ఆ విధంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, నిరుపేదలకు ఎంతో మేలు చేస్తున్నా చంద్రబాబుకు కనిపించదు. చంద్రబాబు ఎంతసేపూ ప్రతి మీటింగ్‌లో మమ్మల్ని తిట్టడమే తప్ప, వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే ఏం చేస్తానని చెప్పడం లేదు. కనీసం తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడనేది కూడా చెప్పుకోలేక పోతున్నాడు. ప్రతి ఎన్నికల్లో పేజీలకొద్దీ మేనిఫెస్టో ప్రకటించి, ఒక్కటీ అమలు చేయడు. అందుకే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు. ఏమన్నా అంటే, తాను 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని, ఎంతో చేశానని చెబుతాడు. కానీ నిజానికి ఆయన చేసిందేమీ లేదు. తాను చేసింది ఏదీ చెప్పకుండా, పదే పదే ఎన్టీఆర్‌ పేరు మాత్రం చెబుతాడు. నిజానికి ఆయన పేదలు, మహిళలకు మేలు చేశాడు.

మీవి బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌
1995లో అదే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని, అధికారాన్ని, సీఎం పదవిని లాక్కున్నాడు. తాను 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పే చంద్రబాబు, తన బ్రాండ్‌గా కనీసం ఒక్క పథకాన్ని అయినా చెప్పుకోగలడా? ఆయనది ఎంతసేపూ బ్యాక్‌డోర్‌ పాలిటిక్స్‌. ఆయన పార్టీ, ఆయన స్థాపించింది కాదు. సీఎం పదవిని తొలిసారి ప్రజల నుంచి పొందలేదు. వెన్నుపోటు పొడిచి ఆ పదవి ఎక్కాడు. ఆ తర్వాత కూడా ప్రతి ఎన్నికలోనూ ఎవరో ఒకరితో పొత్తుతోనే నెగ్గాడు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నా, పేదలకు న్యాయం చేయలేదు.
చదవండి: కాంగ్రెస్‌, ప్రతిపక్షాల బల ప్రదర్శనగా ‘సిద్ధూ’ ప్రమాణ స్వీకారం

సెంటు భూమి అయినా ఇచ్చావా?
 2014 నుంచి 5 ఏళ్లు సీఎంగా ఉన్నా, ఒక్క నిరుపేదకు కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదు. అదే మా ప్రభుత్వం దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి, ఏకంగా 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నాం.చంద్రబాబుకు ఏ మాత్రమైనా సిగ్గు ఉందా? ఆయన ఏనాడూ పేదలకు మేలు చేసింది లేదు. వారి బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మేము చేసి చూపుతున్నాం.

ఉదా: అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోట పంచాయతీలో.. మేము వచ్చిన తర్వాత కాలనీలు కట్టాం. చంద్రబాబు వస్తే చూపిస్తాను. కసింకోటలో 600 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇళ్ల నిర్మాణం పూరై్తంది. లబ్దిదారులు తమ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇది ఒక కాలనీ. అయినా చంద్రబాబు పిచ్చి విమర్శలు. ఇంకా కొన్ని చోట్ల మేము ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కడుతున్న ఇళ్లు. మారేడుపల్లి హైవే మీద ఇచ్చిన ఇంటి స్థలాలు ఇవి. అక్కడ గజం స్థలం దాదాపు రూ.10 వేలు ఉంది. అలాంటి చోట్ల చాలా మంది పేదలు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకుని సంతోషంగా ఉన్నారు. 

దెయ్యాలు వేదాలు వల్లించినట్లు
నీవు పేదల గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల్లో కేసు వేశాడు. చివరకు కోర్టులు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, ఇప్పుడు అక్కడ కూడా ఇళ్లస్థలాలు ఇచ్చాం. ఇళ్లు కూడా కట్టించి ఇస్తున్నాం.
ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలను సమా«ధులు కట్టడానికి మాత్రమే అంటున్న చంద్రబాబు, తన గత 5 ఏళ్ల పాలనలో.. 2014–19 మధ్య ఒక్కటంటే ఒక్క ఇంటి స్థలం అయినా ఇచ్చాడా? ధైర్యం ఉంటే చెప్పమనండి.

ఏ ఎండకు ఆ గొడుగు
చివరకు రూ.2 వేల నోట్లు రద్దు చేయాలని తానే చెప్పినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. అంత కంటే హాస్యాస్పదం ఇంకా ఏమైనా ఉందా? దాని గురించి గత అయిదారు నెలలుగా వింటూనే ఉన్నాం. గతంలో రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసిన వెంటనే, స్వాగతించిన చంద్రబాబు.. బీజేపీతో బెడిసి కొట్టడంతో, ఆ నిర్ణయం తుగ్లక్‌ నిర్ణయం అని విమర్శించాడు. నోట్ల రద్దును తీవ్రంగా తప్పు పట్టాడు.ఇంకా హైటెక్‌ సిటీ గురించి పదే పదే చెబుతాడు. నిజానికి దానికి అంతకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వమే పునాది వేసింది. అలా ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మాట్లాడడం.. చంద్రబాబుకు అలవాటు.

వాటి గురించి మాట్లాడే అర్హత లేదు
ఉత్తరాంధ్రలో, విశాఖలో ప్రజలకు మంచి జరుగుతుంటే.. చంద్రబాబుకు ఎందుకు మింగుడు పడడం లేదు.షుగర్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, తన హయాంలో మూసివేసిన షుగర్‌ ఫ్యాక్టరీల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు. అదే విధంగా ఆయన హయాంలో ఎన్ని డెయిరీలు మూతబడ్డాయో చెప్పాలి. తన సొంత సంస్థ హెరిటేజ్‌ కోసం, చిత్తూరు డెయిరీని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తానేదో అన్నింటికీ మేలు చేసినట్లు చెబుతున్నాడు. నిజానికి షుగర్‌ ఫ్యాక్టరీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేనే లేదు.     చంద్రబాబు తన హయాంలో విద్యుత్‌ ఛార్జీలు 5సార్లు పెంచాడు.

చివరకు ఆయన హయాంలోనే నాడు ఉమ్మడి రాష్ట్రంలో బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగాయి. నలుగురు చనిపోయారు. అదీ చంద్రబాబు ఘనకార్యం. నీమీద ప్రజలు తిరగబడితే, పోలీసులతో కాల్పులు జరిపించి, ప్రాణాలు తీసిన హంతకుడివి నీవు. అలాంటి నీవు ఈరోజు విద్యుత్‌ ఛార్జీల గురించి మాట్లాడుతున్నావు.

పదవిలో లేనప్పుడే అది గుర్తుకు వస్తుంది
నాడు పదవి నుంచి దింపి, ఎన్టీఆర్‌ మరణానికి కారణమైన చంద్రబాబు, ఈరోజు అదే ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. తాను అధికారంలో లేనప్పుడే, ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలన్న మాట చంద్రబాబుకు గుర్తుకొస్తుంది. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే, ఏనాడూ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వాలని అడగలేదు. ఇప్పుడు దెయ్యాలన్నీ ఏకమయ్యాయి. ఎన్టీఆర్‌ పేరు వాడుతున్నాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు కనీసం జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

కొన్ని నెలల్లో టిడ్కో ఇళ్లు
మేము చెప్పిందే చేస్తున్నాం. మేము ఏనాడూ మాట తప్పలేదు. గ్రామాల్లో అన్ని చోట్లా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్తగా జగనన్న కాలనీల్లో కూడా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నాం. రోడ్లు, నీరు, కరెంటు, డ్రైనేజీ వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ఆ ఇళ్లలో దిగే వారికి అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుంది.

చంద్రబాబు టిడ్కో ఇళ్ల గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆయన వాటిలో కనీస సదుపాయాలు కల్పించలేదు. నీరు, విద్యుత్‌ కనెక్షన్లు కూడా ఇవ్వలేదు. అలాంటి ఇళ్లు ఎలా కేటాయిస్తాం. అందుకే మేము వాటన్నింటినీ పూర్తి చేసి, ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైంది. కొన్ని నెలల్లో వాటి కేటాయింపు పూర్తవుతుంది.

నీరు, విద్యుత్‌ సదుపాయం లేకుండా ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం? అందుకే జగనన్న కాలనీల్లో వాటిని ఏర్పాటు చేసి, వేగంగా ఇళ్లు నిర్మిస్తున్నాం. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చాం. అలాగే 300 అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే ఇస్తామన్నాం. దానికే కట్టుబడి ఉన్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement