ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య యూనివర్శిటీకి ఉన్న దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరును మార్చి మరో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టడం సమంజసమేనా? అసలు ఇది అవసరమా? అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం జరిగి, తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లాభం కలుగుతుందా అన్న చర్చ కూడా వస్తుంది. దీనిపై ఆయా ప్రముఖులు చేసిన వ్యాఖ్యల తర్వాత వైఎస్సార్‌సీపీకి ఎలాంటి నష్టం వాటిల్లదని, పైగా జగన్ చేసిన ఈ నిర్ణయం ఒక వ్యూహంగా మారి, ఆయన వేసిన ట్రాప్ లో తెలుగుదేశం చిక్కుకుందన్న అభిప్రాయం కలుగుతుంది.
ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో ఇలాంటివి ఎప్పుడూ జరగనట్లు మాట్లాడారు. నిజానికి ఆయన టైమ్‌లో పోలవరం ప్రాజెక్టుకు ఉన్న ఇందిరా సాగర్ పేరును తొలగించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో ఉన్న స్కీమ్ లో రాజీవ్ పేరు తీసేసి ఎన్.టి.ఆర్.పేరు పెట్టుకున్నారు. వీరిద్దరు జాతీయ నేతలు, ప్రధానులుగా చేసినవారు.
వారి పేర్లు తొలగించిన రోజున ఏ మీడియా గగ్గోలు పెట్టలేదు. ప్రస్తుతం పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ నేతలు కొందరు కూడా ఆ విషయంపై నిరసనలకు దిగలేదు. కాని ఇప్పుడు ఆరోగ్య యూనివర్శిటీ పేరు మార్చగానే తెలుగుదేశం మీడియాగా పేరొందిన ఈనాడు, జ్యోతి వంటివి చాలా ఘోరం జరిగిపోయినట్లు ప్రచారం చేశాయి. దానికి కారణం దీని ఆసరగా చేసుకుని టీడీపీపై కాస్త సానుభూతి పెంచాలన్న లక్ష్యమే అని వేరే చెప్పనవసరం లేదు. కాని అసలు వాస్తవం ఏమిటంటే ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు రామారావుపై ఎలాంటి గౌరవం లేదు. ఆయన 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు వ్యవహరించిన తీరే నిదర్శనం. ఎన్.టి.ఆర్.ను పడగొట్టి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడంలో వ్యూహాలు రచించడంలో ఈ మీడియా సంస్థల వారు విశేష కృషి చేశారు.
అందువల్లే ఈనాడు వంటి పత్రికలలో ఆ రోజుల్లో దారుణమైన కార్టూన్లు ఎన్.టి.ఆర్.పై వచ్చేవి. లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్. వివాహం చేసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన నిరసన తెలిసిందే. కాకపోతే 1994లో ఎన్.టి.ఆర్.అదికారంలోకి వచ్చాక లక్ష్మీపార్వతి వివాహాన్ని సమ్మతిస్తున్నట్లు నటించారు. తదుపరి ఆయనను పదవీచ్యుతులను చేయడం,ఆ మానసిక వ్యధతో ఆయన మరణించడం వంటి ఘట్టాల తర్వాత లక్ష్మీపార్వతిని అంటరాని వ్యక్తిగానే చూశారు. అందువల్లే లక్ష్మీపార్వతి ఈ వ్యవహారంపై స్పందించిన తీరు ప్రజలను కొంతమేర ఆకట్టుకుంది. తాను ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులు తనను ఇంటినుంచి గెంటివేసినప్పుడు జగన్ ఆర్దిక సాయం చేశారని వెల్లడించారు. ఎన్.టి.ఆర్.పేరు మార్చినా ఆమె రాజీనామా చేయరా అన్న విమర్శను టీడీపీ వర్గాలు చేశాయి. దీనిపై ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి కుర్చీ లాక్కుని ఆయన మరణానికి కారకులైనవారు తనను ప్రశ్నిస్తారా అని ఆమె మండిపడ్డారు.
నిజమే.. పేరు మార్చితేనే ఘోరం జరిగిపోయిందని చెబుతున్నవారు, ఎన్.టి.ఆర్ పదవినే ఎలా లాక్కున్నారన్నదానికి జవాబు ఇవ్వడం లేదు. జూనియర్ ఎన్.టి.ఆర్ ఎంతో జాగ్రత్తగా బేలెన్స్‌డ్‌గా ప్రకటన చేశారు. దానిని కూడా టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక ఆయనపై అవాకులు, చవాకులు పేలాయి. దానికి ప్రతిగా ఆయన అబిమానులు కొందరు చంద్రబాబును విమర్శిస్తూ విజయవాడలో పోస్టర్లు వేశారు. ఇక ఎన్.టి.ఆర్.కుమారుడు బాలకృష్ణ కాని, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు కాని, పేరు మార్పుతోనే తెలుగు జాతి సిగ్గుపడుతోందని వ్యాఖ్యానించడం వివాదాస్సదం అయింది. బాలకృష్ణ వైఎస్సార్‌సీపీలో ఉన్న మాజీ టీడీపీ నేతలు కొందరిని కుక్కలతో పోల్చి వ్యాఖ్యానించడం ఏ మాత్రం బాగోలేదు. ఎందుకంటే తన తండ్రి పట్ల తనకే విశ్వాసం లేకుండా, ఆయనను పదవిచ్యుతుడిని చేసిన కుట్రలో పాల్గొన్నారని, ఆయనకే లేని విశ్వాసం ఎవరికో ఉండాలని అనడం విడ్డూరమన్న వ్యాఖ్యలు వచ్చాయి.
ఈ మొత్తం పరిణామాలన్ని తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో నెట్టాయని చెప్పవచ్చు. వారు గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చి ఊరుకున్నా, ఒక ప్రకటన చేసి వదలివేసినా ప్రభుత్వ పక్షం వైపు కొంత ఇబ్బంది ఉండేదేమో. అలాకాకుండా టీడీపీవారు, బాలకృష్ణ వంటివారు రెచ్చిపోవడంతో ఎన్.టి.ఆర్.కు గతంలో చంద్రబాబు, బాలకృష్ణతో సహా ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి చేసిన అవమానాలన్ని బయటకు వచ్చి టీడీపీకే నష్టం చేశాయి. సూది కోసం సోదికి వెళితే పాత విషయాలేవో బయటకు వచ్చినట్లుగా టీడీపీ పరిస్థితి తయారైంది. గత టరమ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాతికపైగా స్కీములకు తన పేరు పెట్టుకున్నారు.ఏకంగా కాపు భవన్ కు కూడా చంద్రబాబు పేరు పెట్టబోతే తీవ్ర నిరసన ఎదురైంది. దాంతో ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గారు.
చంద్రబాబు చూపిన మార్గం జగన్ కు బాగా కలిసివచ్చింది. ఈయన పలు స్కీములకు తన తండ్రి పేరు, మరికొన్ని స్కీములకు తన పేరు పెట్టుకున్నారు.ప్రజలు కూడా వీటికి అలవాటు పడిపోయారు. తెలంగాణలో కెసిఆర్ పేరుతో కొన్ని స్కీములు ఉన్నాయి.ఇదంతా వర్తమానం. ఎన్.టి.ఆర్.ఆరోగ్య యూనివర్శిటీ పేరు తొలగించి వైఎస్ ఆర్ ఆరోగ్య యూనివర్శీటీ అని ఎపి శాసనసభ , మండలిలో చట్ట సవరణ చేశారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు ఆ క్రమంలో వారు స్పీకర్ పట్ల కూడా అనుచితంగా వ్యవహరించారు. అది కూడా అబ్యంతరకరమే. ఇదే విధంగా స్పీకర్ పై వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరిస్తే వీరిని రౌడీలుగా తెలుగుదేశం, ఆ పార్టీ మీడియా చిత్రీకరించేది. ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రతిపక్షంపై ఆగ్రహం వ్యక్తం చేయగానే ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించేవి. కాని ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేసినా అసలు వార్తలే ఇవ్వ లేదంటే ఆశ్చర్యం కాదు.
ఇది వేరే సంగతి.. ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లు దీనిపై కీలకంగా మాట్లాడారు. విడదల రజనీ గతంలో ఎన్.టి.ఆర్.ను చంద్రబాబు పదవీచ్యుతులు చేసిన ఘట్టం మొదలు చంద్రబాబు అప్పట్లో ఎన్.టి.ఆర్.ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఈనాడు పత్రికలో ఎన్.టి.ఆర్.ను కించపరుస్తూ వేసిన పలు కార్టూన్లను ప్రదర్శించి టీడీపీ వారికి ఎన్.టి.ఆర్.గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇస్తూ తనకు ఎన్.టి.ఆర్. అంటే గౌరవమేనని, ఎలాంటి వ్యతిరేకత లేదని అంటూనే పేరు ఎందుకు మార్చుతున్నది చెప్పారు. గతంలో పదకుండు మెడికల్ కాలేజీలు ఉండగా, వైఎస్ ఆర్ కొత్తగా మూడు ఏర్పాటు చేశారని, ప్రస్తుతం తాను పదిహేడు కాలేజీలను నెలకొల్పుతున్నానని, ఆరోగ్య రంగానికి వైఎస్ ఇచ్చిన ప్రధాన్యత అపారమైనదని, ఆరోగ్యశ్రీ తదితర స్కీములను ఆయనే తెచ్చారని ఆయన అన్నారు. జగన్ తన వాదనలో తనకు ఎన్.టి.ఆర్.పట్ల గౌరవం ఉండబట్టే కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టానని, తెలుగుదేశం వారు తాము సాధించిన లేదా నిర్మించిన ఏ సంస్థకైనా ఎన్.టి.ఆర్.పేరు పెట్టాలని కోరితే అభ్యంతరం లేదని అన్నారు.
చంద్రబాబుకు అసలు ఎన్.టి.ఆర్. గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ పలు ఉదాహరణలు ఇచ్చారు. నిజమే చంద్రబాబు గతంలో ఎన్.టి.ఆర్.పట్ల అవమానకరంగా వ్యవహరించారు. ఎన్.టి.ఆర్. మరణం తర్వాత ఆయన లెగసీని తన ఆధ్వర్యంలోని టీడీపీకే వచ్చేలా చేసుకున్నారు.అది ఆయన తెలివితేటలు కావచ్చు.కాని జగన్ తాను ఎన్.టి.ఆర్. ను గౌరవిస్తానని చెబుతూనే ఇలా పేరు మార్చడంలో కొంత లాజిక్ లేనట్లు కనిపిస్తున్నా, అంతిమంగా ఆయన వ్యూహమే ఫలించినట్లుగా కనిపిస్తోంది. టీడీపీలోని ఒక వర్గం వారే దీనిపై గొడవ చేస్తున్నారన్న అబిప్రాయం ఇతర వర్గాలలో ఏర్పడింది.
కొందరు వైఎస్సార్‌సీపీ అభిమానులు మాత్రం టీడీపీ హయాంలో అసెంబ్లీలో వైఎస్ చిత్రపటం తొలగించినప్పుడుకాని, విజయవాడ సెంటర్ లో వైఎస్ విగ్రహాన్ని అర్దరాత్రి తీసివేసినప్పుడు కాని, వైఎస్ మరణం తర్వాత టీడీపీ వారు అవమానించిన తీరు కాని మొదలైనవాటిని ప్రస్తావిస్తున్నారు. ఎన్.టి.ఆర్.పేరు మార్పును తప్పుపడుతున్నవారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. హైదరాబాద్ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్.టి.ఆర్.పేరు ఉండేది. అంతర్జాతీయ టెర్మినల్ కు రాజీవ్ గాంధీ పేరు ఉండేది. విమానాశ్రయం శంషాబాద్ కు మారిన తర్వాత ఎన్.టి.ఆర్.పేరును తొలగించారు.దీనిపై అప్పట్లో టీడీపీ నిరసనలు చేసింది.కేంద్రంలో ఆనాడు కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుపిఎ ప్రభుత్వం ఉండేది. తదుపరి ఎన్.డి.ఎ. ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం నేత పి.అశోక్ గజపతి రాజు నాలుగేళ్లపాటు పౌరయాన, విమాన శాఖ మంత్రిగా కేంద్రంలో ఉన్నారు. కాని ఆయన శంషాబాద్ లో డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్.టి.ఆర్.పేరు పెట్టలేదు.అలాగే విజయవాడ ఎయిర్ పోర్టుకు ఎన్.టి.ఆర్.పేరు పెట్టాలని పలువురు కోరారు. అప్పుడు చంద్రబాబు కాని, అశోక్ గాని సీరియస్ గా తీసుకోలేదు. అంతేకాదు.రాజధాని గ్రామాలకు ఎన్.టి.ఆర్.క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరం రాశారు.
దానిపై చంద్రబాబు ఆగ్రహించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈనాడు అదినేత రామోజీ చెప్పినట్లు రాజధాని గ్రామాలకు అమరావతి అని పేరు పెట్టారే తప్ప, టీడీపీ వ్యవస్థాపకుడి పేరు పెట్టి గౌరవించలేదు. ఇప్పుడు యూనివర్శిటీకి ఎన్.టి.ఆర్.తొలగిస్తారా అని టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు.ఎన్.టి.ఆర్.కు భారత రత్న రాకపోవడంలో చంద్రబాబు పాత్ర గురించి మాజీ ఎమ్.పి వై.లక్షీప్రసాద్ పలు విషయాలు వెల్లడించారు. దానికి ఇంతవరకు టీడీపీ జవాబు ఇవ్వలేకపోయింది. ఈ పేరు మార్పు వల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం జరుగుతుందా?అని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఒక పేరు ఆధారంగానే రాజకీయాలు సాగవు.
పైగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు. ఎన్.టి.ఆర్. మరణించి అప్పుడే ఇరవైఎనిమిదేళ్లు గడిచిపోయింది. అంటే ఒక తరం ఎన్.టి.ఆర్. ను చూడలేదు. వారికి ఈ వివాదం పెద్దగా పట్టకపోవచ్చు.ఎన్.టి.ఆర్. పెట్టారు కనుక ఓట్లు పడడం, పేరు తీసేశారు కనుక ఓట్లు పోవడం అన్నది అంత సీరియస్ మేటర్ కాకపోవచ్చు. ఇతర అంశాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రతిపక్ష టీడీపీకి ఇది ఒక విమర్శనాస్త్రంగా ఉంటుంది. కాని వారే ఎన్.టి.ఆర్.పట్ల అనుచితంగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కనుక అది చెల్లుకు చెల్లు అవుతుంది. వైఎస్సార్‌సీపీలో ఉన్న కొంతమంది ముఖ్యంగామాజీ మంత్రి కొడాలి నాని వంటివారు దీనిని సమర్ధించలేరు. అయినా వారేమీ జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించజాలరు.
మరి దీనివల్ల వైఎస్సార్‌సీపీకి, జగన్‌కు ఏమైనా నష్టం వస్తుందా? దీనివల్లే జగన్‌కు రాజకీయంగా నష్టం కలిగే పరిస్థితి ఉంటే చంద్రబాబుకు అసలు రాజకీయ భవిష్యత్తే ఇంతకాలం ఉండకూడదు కదా! ఎన్.టి.ఆర్.ను పదవి నుంచి దించివేసిన చంద్రబాబు ఇన్నాళ్లు రాజకీయాలలో ఎలా కొనసాగారన్న ప్రశ్న వస్తుంది.1994 శాసనసభ ఎన్నికలలో లక్ష్మీపార్వతితో కలిసి ఎన్.టి.ఆర్. ఉమ్మడి రాష్ట్రం అంతటా పర్యటించి ప్రచారం చేశారు. రికార్డు స్థాయిలో సీట్లను గెలిచి అదికారంలోకి వచ్చిన ఆయనకు తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే పరాభవం ఎదురైంది.
చంద్రబాబేకాదు. స్వయంగా ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులే ఆయనను అవమానించారు. పదవి నుంచి దించేయడంలో తమ వంతు సాయం చేశారు. లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్.టి.ఆర్.ను అనరాని మాటలు అన్నారు. ఎన్.టి.ఆర్. పదవి కోల్పోయిన తర్వాత సుమారు నాలుగున్నర నెలలు జీవించి ఉన్నారు. అప్పుడు ఆయన పదవిని కైవసం చేసుకున్న చంద్రబాబు ఆయా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్.టి.ఆర్.కు నైతిక విలువలు లేవని, సినిమా వాళ్ల రోజులు పోయాయని, ఇలా రకరకాల వ్యాఖ్యలుచేశారు.సొంత మామ అని కూడా చూడకుండా మాట్లాడారన్న భావన వచ్చింది.
ఎన్.టి.ఆర్.సైతం చంద్రబాబును తీవ్రపదజాలంతో దూషిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు. కాకపోతే ఎన్.టి.ఆర్. మరణం తర్వాత వెంటనే రంగంలో దూకిన చంద్రబాబు మొత్తం తప్పంతా లక్ష్మీపార్వతిపై నెట్టేసి తామే ఆయనకు అసలైన రాజకీయ వారసులమని ప్రొజెక్టు చేసుకోగలిగారు. ఎన్.టి.ఆర్. మరణం తర్వాత 1996 లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్నా, చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి కూడా గణనీయంగానే అంటే 19 సీట్లు వచ్చాయి. వాటి ఆధారంగానే అప్పట్లో కేంద్రంలో అదికారంలోకి వచ్చిన యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు కూడా పొందారు.
నిజంగానే ఎన్.టి.ఆర్.ను అంతగా అవమానించిన చంద్రబాబు టీడీపీకి ప్రజలు ఎలా ఓట్లు వేశారంటే ఏమి చెబుతాం.అప్పటి పరిస్థితులు అలా వచ్చాయి. ఇక ఆ రోజుల్లో ఈనాడు పత్రిక ఎన్.టి.ఆర్.పై విపరీతమైన విమర్శలతో కార్టూన్లు వేసేది. సంపాదకీయాలు రాసేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్.టి.ఆర్.ను ఈనాడు వెంటాడి, వేటాడేది. చంద్రబాబు అసలు తప్పే చేయలేదన్నట్లుగా పిక్చర్ ఇచ్చేది. అయినా ఈనాడుకు నష్టం జరగలేదు.చంద్రబాబుకు నష్టం జరగలేదు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ,బీజేపీతో కలిసి రెండుసార్లు అదికారంలోకి వచ్చినా, మూడుసార్లు ఓటమి చెందినా వేరే కారణాలు తప్ప ఎన్.టి.ఆర్.కు చేసిన అవమానం కారణం కాదన్న సంగతి గుర్తించాలి.
అలాంటిది ఇప్పుడు ఈ పేరు మార్పు వల్ల జగన్‌కు నష్టం వస్తుందని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అవుతుంది. నిజానికి ఎన్.టి.ఆర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అసలు సంబందమే లేదు. కాకపోతే కృష్ణా జిల్లాకు ఎన్.టి.ఆర్ పేరు పెట్టడం ద్వారా జగన్ క్రెడిట్ తెచ్చుకున్నారు కదా.. అనవసరంగా ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని కొందరు అనుకోవచ్చు. దీని ఆధారంగానే రాజకీయాలు ఎప్పటికీ సాగవుకదా.. కొత్త అంశాలు తెరపైకి వస్తాయి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment