విజయవాడ: టీడీపీ పగ్గాలు బాలకృష్ణ చేపట్టడానికి రంగం సిద్ధమైందా?, చంద్రబాబు జైలుకే పరిమితమైతే తెలుగుదేశం పార్టీని బాలకృష్ణే ముందుకు తీసుకువెళ్లనున్నారా?, నిన్న(సోమవారం) పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చలు, ఈ రోజు(మంగళవారం) స్వయంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం దీనికి సంకేతమా?, అంటే అవుననే సమాధానమే స్వయంగా బాలకృష్ణ నోటినుంచి వచ్చింది.
వస్తున్నాను.. ముందుంటాను..
విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టిన బాలకృష్ణ.. స్పష్టంగా రెండు విషయాల మీద మాట్లాడారు.
- చంద్రబాబు అరెస్ట్
- పార్టీ నేతృత్వం
తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ‘ నేను వస్తున్నాను.. ముందుంటాను’ అంటూ ఒక ప్రకటన చేశారు.
ఇది కక్షసాధింపే
ఎలాంటి ఆధారాలు లేకుండా కక్షసాధింపుతోనే కుట్ర చేశారు, అవినీతి జరిగిందని చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారు, వేల మంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌ది ఘన చరిత్ర
తెలుగు వాళ్లు ఎన్నెన్నో చేశాం. ప్రజలు గమనించాలి. స్వాతంత్ర్య సమరం మన తరం చూడలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాకే ప్రజల్లో చైతన్యం వచ్చింది. మనకో చరిత్ర ఉంది. చారిత్రక నేపథ్యం ఉంది. అందుకే ఎన్టీఆర్ పార్టీ స్థాపించారు. 1989లో నేషనల్ ఫ్రంట్‌కు నేతృత్వం వహించి పార్టీలను ఏకం చేశారు. అంటే దేశాన్ని ఏకం చేసినట్టే. రాష్ట్రంలోనూ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు సేకరించడంలో ప్రజలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఘనత నాన్న ఎన్టీఆర్‌ది. ఎవ్వరికీ భయపడేది లేదు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కు
ప్రజాస్వామ్యం అందరికీ హక్కు ఇచ్చింది. అంతేగానీ ఎవరికో భయపడి, చేతులు ముడుచుకు కూర్చుంటే ఎలా? ఏం జరుగుతోంది ఇక్కడ? దానికి తోడు భయపెడతారా? పార్టీలో ప్రతీ ఒక్కరు సైనికుడిగా తిరగబడాల్సిన సమయం ఆసన్నమయింది. ఆలోచించడం కాదు ఆచరణలో పెట్టాల్సిన సమయమిది.
ఎవ్వరికీ భయపడేది లేదు
ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలి? ప్రిపేర్ అవుతున్నాను. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అందరూ ఉద్యమించాల్సిన తరుణమిది. 1984లో ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేసినపుడు ఎలాగైతే ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం రావాలి. అందరూ కూడా ఇప్పుడు ఏకం కావాలి. ఎవ్వరికీ భయపడే పని లేదు. నేను వస్తున్నాను. నేను పార్టీకి ముందుంటాను. తెలుగు వాడి పౌరుషం ఏంటో చూపిస్తాను.
రాజకీయంగా చర్చనీయాంశం
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీలో ఇప్పుడు ఏ రకంగా చూసినా బాలకృష్ణనే సీనియర్. పైగా ఎన్టీఆర్ కుటుంబంలో ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న ఏకైక పొలిటిషియన్. సినిమాల ద్వారా కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ నేతృత్వమే పార్టీకి మంచిదన్నది తెలుగు తమ్ముళ్లలో ఓ వర్గం అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment