పరిపూర్ణమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పరిపూర్ణమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం

Published Fri, Jun 23 2023 2:00 AM | Last Updated on Fri, Jun 23 2023 2:00 AM

ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌  - Sakshi

ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

యర్రగొండపాలెం: ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుకుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గురువారం మండలంలోని గురిజేపల్లిలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను చివరి ఇంటి వరకు చేర్చేందుకు వలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలు లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పథకాలు సక్రమంగా అందాయా..లేదా..? అని తెలుసుకోవడానికి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. జగనన్న పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయని మంత్రి విమర్శించారు. ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి.. ఆ తర్వాత మోసం చేయడమే పనిగా ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని అన్నారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా వెలగబెట్టిన చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు తానేదో చేస్తానని అనడంలో నిజం లేదని రాష్ట్ర ప్రజలే బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. జగనన్న సీఎం బాధ్యతలు చేపట్టిన 4 సంవత్సరాల కాలంలో ఎన్నికల హామీలన్నీ నెరవేర్చారని వివరించారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్ది ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి అకౌంట్‌లో నేరుగా డబ్బు జమచేస్తున్నారని, దీనివలన పేద కుటుంబాలకు ఊరట కలుగుతోందని మంత్రి అన్నారు.

జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి...

సమస్యలు పరిష్కరించే దిశగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు. అన్ని శాఖల అధికారులు పాల్గొని తక్షణమే సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రాష్ట్రంలో చక్కటి పాలన అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముందుగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్‌, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ మూడమంచు బాలగురవయ్య, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పర్తి ఓబులరెడ్డి, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ షాబీర్‌బాష, సచివాలయాల మండల కన్వీనర్‌ సయ్యద్‌ జబీవుల్లా, సర్పంచ్‌ల సంఘ జిల్లా అధ్యక్షుడు దుగ్గెంపూడి సుబ్బారెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాములు నాయక్‌, నాయకులు ఎన్‌.వెంకటరెడ్డి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఏకుల ముసలారెడ్డి, పబ్బిశెట్టి శ్రీనివాసులు, షేక్‌ వలి, బి.బాలచెన్నయ్య, వెన్నా రామిరెడ్డి, బాలయోగిరెడ్డి, సర్పంచ్‌ పి.జ్యోతి, ఎంపీటీసీ ఆదిలక్ష్మి, తహసీల్దార్‌ కె.రవీంద్రరెడ్డి, ఎంపీడీవో వై.వి.నాగేశ్వరప్రసాద్‌, ఈవోఆర్డీ ఈదుల రాజశేఖరరెడ్డి, హౌసింగ్‌ డీఈ సురేష్‌బాబు, డీటీ విజయభాస్కర్‌, ఏపీవోలు శైలజ, నాగేశ్వరరావు, విద్యుత్‌ శాఖ ఏఈ అల్లూరయ్య, ఎంఈవో పి.ఆంజనేయులు పాల్గొన్నారు.

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ గురిజేపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement