![బాలకా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ong301-260103_mr-1739215693-0.jpg.webp?itok=P1tPZOYH)
బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సిటీ:
బాలకార్మికులు లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న బాలల వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ, జిల్లా కార్మిక శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ప్రకాశం భవనం వద్ద నుంచి అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ, చర్చిసెంటర్లో మానవహారం నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రతిజ్ఞ చేయించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాలలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలపై ఉందన్నారు. బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే కార్మిక శాఖ, బాలల కోసం ఏర్పాటు చేయబడిన స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు గుర్తించి పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. బాలలకు బంగారు బాల్యం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వెట్టి చాకిరిని సంపూర్ణంగా నిర్మూలించడమే లక్ష్యంగా అవగాహన కోసం మనమంతా నడుంబిగిద్దామని అన్నారు. ఏ పరిశ్రమలో వెట్టిచాకిరి ఉందో గుర్తించడంతో పాటు దాని నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమ ఏదైనాగానీ.. ముందుగా డబ్బు ముట్టజెప్పడం ద్వారా వ్యక్తులను నియమించుకునే పద్ధతి మానుకోవాలన్నారు. మనదేశంలోని చిట్టచివరి వెట్టి చాకిరి కార్మికులను సైతం రక్షించేందుకు వారికి పూర్తిస్థాయి పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ నేరంలో ప్రమేయం కలిగిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను వెట్టిచాకిరి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా సంపన్నమైన జీవితం గడిపేలా చూస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. అనంతరం బాలల వెట్టి చాకిరి నిర్మూలన అవగాహన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఈఓ అత్తోట కిరణ్ కుమార్, జిల్లా ఉప కార్మిక శాఖాధికారి గాయత్రి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కే వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి.సాగర్, ఒంగోలు డిప్యూటీ విద్యాశాఖ అధికారి చంద్రమౌళీశ్వరరావు, ఒంగోలు ఎంఈఓ కిషోర్‌బాబు, సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్, సునీల్ కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
![బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/11/10ong14-600501_mr-1739215694-1.jpg)
బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
Comments
Please login to add a commentAdd a comment