సీఎస్ పురం (పామూరు): కంది పైరు చుట్టూ ఏర్పాటు చేసిన ముళ్ల కంచె దగ్ధమైంది. దాంతో పాటు కొంత మేరకు కంది పైరు కూడా కాలిపోయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి సీఎస్ పురం మండలంలోని అంబవరం కొత్తపల్లె వద్ద చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి అనే రైతు జాతీయ రహదారి పక్కన 10 ఎకరాల్లో కంది పంట సాగుచేశాడు. పందులు, పశువుల నుంచి పంటను కాపాడేందుకు పొలం చుట్టూ చిల్లకంపతో కంచె ఏర్పాటు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు కంచెకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి కాలిపోయింది. సమీపంలోని వారు పొలం యజమాని వెంకట సుబ్బారెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. అతను అక్కడికి చేరుకునేసరికే పూర్తిగా కంచెతో పాటు అక్కడక్కడా కంది పైరు కూడా కాలిపోయింది. కనిగిరి అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ ఆఫీసర్ బంగారుబాబు ఆధ్వర్యంలో ఫైరింజన్‌తో సిబ్బంది వచ్చారు. సుమారు 5.30 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. చుట్టుపక్కల పొలాలకు మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. గ్రామంలో తమకు గిట్టనివారే కంచెకు నిప్పుపెట్టి ఉంటారని రైతు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.
రూ.లక్ష నష్టం గిట్టనివారే నిప్పుపెట్టి ఉంటారంటున్న రైతు
Comments
Please login to add a commentAdd a comment