![సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ong16-600501_mr-1739215693-0.jpg.webp?itok=I8Yl8zyq)
సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయం
ఒంగోలు సిటీ:
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 232 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ కోసం అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని సూచించారు. పిటీషన్లు రీ ఓపెన్ కాకుండా చూడాలని చెప్పారు. అర్జీల పరిష్కారంలో సహేతుకత ముఖ్యమన్నారు. మొక్కుబడి సమాధానాలతో అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ ఇచ్చేసి సమస్యను పరిష్కరించినట్లు రికార్డుల్లో చూపితే సహించబోనన్నారు. క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కావాల్సిందేనని, పరిష్కరించలేని పక్షంలో అందుకు కారణాలను కూడా అర్జీదారులకు వివరించాలని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలేమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ బి.చినఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పార్దసారధి, వరకుమార్, జాన్సన్, విజయ జ్యోతి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొలతలు వేసి అక్రమ మైనింగ్ తేల్చాలి...
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం యర్రబాలెం గ్రామ నివాసి మొరవినేని పవన్‌కుమార్ మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాకు అర్జీ అందజేశారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం బూరేపల్లి గ్రామంలో ప్రభుత్వానికి సంబంధించిన కొండ ఉందని, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేశారు. తేదీ 16.12.2024న కూడా దీనిపై తాను అర్జీ ఇచ్చానని తెలిపారు. అప్పుడు డిసెంబరు 23వ తేదీ మైనింగ్ వారు వచ్చి అక్రమ మైనింగ్ జరిగిందని తాత్కాలికంగా ఒక నివేదిక ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం మళ్లీ మైనింగ్ జరుగుతోందన్నారు. దీనిపై గత జనవరి 27వ తేదీ జాయింట్ కలెక్టర్‌కు తెలపగా, అక్కడకు వెళ్లి మైనింగ్ ఎంత జరిగిందో కొలతల ద్వారా నివేదిక ఇవ్వాలని డీడీని ఆదేశించారు. కానీ, 15 రోజులు గడుస్తున్నా నేటికీ ఎవరూ రాలేదన్నారు. ఇది మూడు ఊర్ల సమస్య అని తెలిపారు. యర్రబాలెం, బూరేపల్లి, అన్నంగి గ్రామాల్లో గొర్రెల కాపర్లు, గేదెలు మేపుకునే వారు మైనింగ్‌తో ఎంతో ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. అందువలన అక్రమ మైనింగ్ జరగకుండా ఆపాలని కోరారు. అక్కడ అక్రమ మైనింగ్ ఎంత జరిగిందో తెలుసుకోవాలంటే కొలతలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కొలతలు వేసి అక్రమ మైనింగ్‌ను తేల్చాలని కోరుతూ పవన్‌కుమార్ కలెక్టర్‌కు అర్జీ అందజేశారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా మీ కోసం కార్యక్రమానికి 232 అర్జీలు
Comments
Please login to add a commentAdd a comment