![ఎట్టకేలకు శివాచారి మృతదేహానికి అంత్యక్రియలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10ong604-260048_mr-1739215694-0.jpg.webp?itok=UIHZUkYq)
ఎట్టకేలకు శివాచారి మృతదేహానికి అంత్యక్రియలు
గిద్దలూరు రూరల్: పట్టణంలోని వైశ్య బ్యాంక్ రోడ్డులో ఆస్తి కోసం అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా హయగ్రీవ శివాచారి అనే వ్యక్తి మృతదేహం మూడు రోజులుగా ఇంటి ముందే ఉన్న విషయం విధితమే. హైదరాబాద్‌లో మృతిచెందిన శివాచారిని భార్య ఈశ్వరమ్మ తన కుమారుడితో కలిసి గిద్దలూరులోని అత్త సుబ్బలక్ష్మమ్మ ఇంటి వద్దకు తీసుకొచ్చింది. అంత్యక్రియలు నిర్వహించకముందే ఆస్తి విషయమై వాదన జరగడంతో సుబ్బలక్ష్మమ్మ తన కుమార్తెతో కలిసి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇంటి ముందే భర్త మృతదేహంతో ఈశ్వరమ్మ ఉండిపోయింది. సమాచారం అందుకున్న సీఐ కె.సురేష్, తహసీల్దార్ ఎం.ఆంజనేయరెడ్డిలు సుబ్బలక్ష్మమ్మకు ఫోన్ చేసి ఇంటి వద్దకు రావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో సుబ్బలక్ష్మమ్మ సోమవారం వేకువజామున వచ్చి ఇంటి తాళం తీసింది. అధికారులు, నగర పంచాయతీ సిబ్బంది సహాయంతో శివాచారి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. మూడు రోజులుగా ఇంటి ముందు రోడ్డుపై ఉంచిన మృతదేహాన్ని తరలించడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆస్తితో పాటు అందరూ ఉన్నప్పటికీ శివాచారి మృతదేహాన్ని నగర పంచాయతీ సిబ్బందితో తరలించడంపై అతని భార్య, తల్లి, సోదరి తీరును పలువురు విమర్శించారు.
నెట్‌బాల్ జట్ల ఎంపిక నేడు
ఒంగోలు: నెట్‌బాల్ ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి జూనియర్ విభాగం బాలబాలికల జట్లను ఈ నెల 11వ తేదీ దొనకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కృష్ణారెడ్డి, ఐపీ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల వయస్సు 19 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు నకలుతో పాటు స్టడీ సర్టిఫికెట్‌తో హాజరుకావాలన్నారు. ఎంపికై న జట్లు ఈ నెల 16 నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వెల్లడించారు.
17 మద్యం దుకాణాలకు లాటరీ
ఒంగోలు సిటీ: జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 17 మద్యం దుకాణాలకు సోమవారం ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో లాటరీ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 171 మద్యం దుకాణాలకుగానూ వాటిలో 10 శాతం.. అనగా, 17 షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే. వీటికి నోటిఫికేషన్ విడుదల చేయగా, జిల్లా వ్యాప్తంగా 159 దరఖాస్తులు వచ్చాయి. ఒంగోలు కార్పొరేషన్ నుంచి అత్యధికంగా 22 దరఖాస్తులు రాగా, పీసీ పల్లి నుంచి అతి తక్కువగా మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న సమక్షంలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లాటరీ ప్రక్రియ కొనసాగింది. ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ షేక్ ఖాజా మొహిద్దీన్ పాల్గొన్నారు.
బి.ఎడ్ పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ
ఒంగోలు సిటీ: తొలిరోజు బి.ఎడ్ పరీక్షలను ఆంధ్రకేసరి యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.వి.ఎన్.రాజు మార్కాపురం ప్రాంతంలోని కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి డిగ్రీ కళాశాల, వేమన డిగ్రీ కళాశాల, ఐడియల్ అండ్ కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో 110 బి.ఎడ్ కళాశాలలు ఉన్నాయన్నారు. మొత్తం 11,279 మంది విద్యార్థులకు రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ కోసం 40 పరీక్ష కేంద్రాలను, 16 నోడల్ కేంద్రాలను ఆంధ్రకేసరి యూనివర్శిటీ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలను సజావుగా, సక్రమంగా నిర్వహించేందుకు, పర్యవేక్షించేందుకు ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కొక్క పరిశీలకునితో పాటు రెండు స్క్వాడ్ బృందాలను యూనివర్శిటీ అధికారులు నియమించినట్లు తెలిపారు. పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, ఇతర అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు తప్పనిసరిగా మౌలిక వసతులు కల్పించాలని యూనివర్శిటీ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, యాజమాన్యాలకు రాజు సూచించారు. ఆయన వెంట ఆంధ్రకేసరి యూనివర్శిటీ పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్ విభాగం) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment