వణికిస్తున్న జ్వరాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న జ్వరాలు

Published Sat, Sep 21 2024 3:00 AM | Last Updated on Sat, Sep 21 2024 3:00 AM

వణికి

మార్కాపురం: మార్కాపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు మార్కాపురం జీజీహెచ్‌తో పాటు ప్రైవేటు హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలకు వాతావరణం మారడంతో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. తలనొప్పి, జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. మార్కాపురం జీజీహెచ్‌లో రోజుకు 500 నుంచి 600 వరకూ ఓపీ ఉంటుండగా, అందులో సుమారు 150 నుంచి 200 వరకూ జ్వరబాధితులే ఉంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. కాలువల్లో పూడిక తీసి రోడ్డుపైనే ఉంచడంతో దోమలు వ్యాపిస్తున్నాయి. గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌తో పాటు పట్టణంలో ఉన్న సుమారు 20కిపైగా ప్రైవేటు వైద్యశాలల్లో వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నవారు చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని పీఎస్‌ కాలనీ, భగత్‌సింగ్‌ కాలనీ, జవహర్‌నగర్‌ కాలనీ, ఎస్టేట్‌, డ్రైవర్స్‌ కాలనీ, మండలంలోని వేములకోట, నాగులవరం, దరిమడుగు, గజ్జలకొండ తదితర గ్రామాల్లో కూడా పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. చిన్నారులు సైతం జ్వరాలతో సతమతమవుతున్నప్పటికీ వైద్యశాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జ్వరాలను అదుపు చేసేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ.. కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. మొక్కుబడిగా పనిచేస్తూ.. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, రోడ్డు వెంబడి తినుబండారాలు వద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటుకు దూరంగా ఉండాలని ఉచిత సలహాలకే పరిమితమయ్యారు.

అనంతవరంలోనూ విజృంభిస్తున్న జ్వరాలు...

టంగుటూరు: మండలంలోని అనంతవరం గ్రామంలోనూ ప్రజలను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. పారిశుధ్య లోపం కారణంగా ఎక్కడి మురుగు అక్కడే నిల్వ ఉండటంతో దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. స్థానిక ఎస్సీకాలనీలో విషజ్వరాలతో ప్రజలు మంచంపట్టారు. 104 సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఆ దాఖలాలు కనిపించడం లేదు. గ్రామంలోని వాటర్‌ ప్లాంట్‌ను శుభ్రపరచకపోవడం కూడా జ్వరాలకు మరో కారణమని ప్రజలు భావిస్తున్నారు. వైద్యాధికారులు వెంటనే స్పందించి వైద్య శిబిరాలు నిర్వహించాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరిచి వాటర్‌ ప్లాంట్‌ను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మార్కాపురం జీజీహెచ్‌కి క్యూ కడుతున్న

బాధితులు

పట్టించుకోని అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
వణికిస్తున్న జ్వరాలు 1
1/1

వణికిస్తున్న జ్వరాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement