వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యునిగా ఆదిమూలపు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యునిగా ఆదిమూలపు

Published Fri, Sep 27 2024 3:00 AM | Last Updated on Fri, Sep 27 2024 3:08 AM

వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యునిగా ఆదిమూలపు

సింగరాయకొండ: వైఎస్సార్‌ సీపీ అత్యున్నతస్థాయి రాజకీయ నిర్ణయాత్మక కమిటీ (పీఏసీ) సభ్యునిగా మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. దీనిపై ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పీఏసీలో సభ్యునిగా నియమించిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణను ఈ కమిటీ నిర్ణయిస్తుందని, ఈ కమిటీలో జగనన్నతో పాటు మరో ఆరుగురు సభ్యులు ఉంటారని తెలిపారు. దళితుడిని అయిన తనకు అత్యున్నత కమిటీలో స్థానం కల్పించడం జగనన్న ఔదార్యానికి నిదర్శనమని, దళితులకు పెద్దపీట వేస్తారని మరోసారి ఆయన నిరూపించుకున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ అవినీతి, అబద్ధపు హామీలు, ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా పనిచేస్తానన్నారు. 2029 ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని సురేష్‌ తెలిపారు.

ఒంగోలు ఆర్డీఓగా లక్ష్మీప్రసన్న

కనిగిరి ఆర్డీఓగా కేశవర్దన్‌రెడ్డి

ఒంగోలు అర్బన్‌: ఒంగోలు రెవెన్యూ డివిజినల్‌ అధికారి (ఆర్డీఓ)గా కె.లక్ష్మీప్రసన్నను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న జీవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా కనిగిరి డివిజన్‌ ఆర్డీఓగా జి.కేశవర్దన్‌రెడ్డిని నియమించారు. ప్రస్తుతం కనిగిరి ఆర్డీఓగా ఉన్న జాన్‌ ఇర్విన్‌ను బదిలీ చేశారు.

29న ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 జిల్లా క్రీడా జట్ల ఎంపిక

ఒంగోలు: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) అండర్‌–17 జిల్లా క్రీడా జట్ల ఎంపికను ఈ నెల 29వ తేదీ నిర్వహించనున్నట్లు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి కె.వనజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శర్మా కాలేజీ ఎదురుగా ఉన్న భారత జాతీయ వ్యాయామ కళాశాలలో పవర్‌లిఫ్టింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడా జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. నెక్ట్స్‌ జన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో షూటింగ్‌, సమావేశం ఉన్నత పాఠశాలలో ఆర్చరీ క్రీడా జట్ల ఎంపిక ఉంటుందన్నారు. ఫెన్సింగ్‌ క్రీడాకారుల ఎంపికను స్థానిక గద్దలగుంటలోని ఎస్‌పీకేఆర్‌ ఓరియంటల్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పీఈటీ/పీడీలు ఆసక్తి కలిగిన విద్యార్థులతో ఆన్‌లైన్‌ ఎంట్రీ చేయించి మాన్యువల్‌ ఎంట్రీఫాంతో ఎంపికకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అండర్‌–17 కేటగిరీలో పాల్గొనే ఇంటర్‌ విద్యార్థులు పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, జ్ఞానభూమి చైల్డ్‌ ఐడీ నంబర్‌, సంబంధిత ప్రిన్సిపాల్‌ ధ్రువీకరణ పత్రంతో నిర్వాహకులకు సంప్రదించాలని కోరారు.

సొంత శాఖలో వారే

కుట్ర చేశారా?

ఒంగోలు టౌన్‌: జిల్లా సహకార సంఘం ఆడిట్‌ అధికారి పోలిశెట్టి రాజశేఖర్‌పై దాడి చేసింది సొంత శాఖలో పనిచేసేవారేనా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. కీలకమైన ఆధారాలతో ఒంగోలుకు చెందిన ఆరుగురిని బుధవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించి అసలు విషయం రాబట్టారు. డీసీఏవో రాజశేఖర్‌ గత ఆరేళ్లుగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. గతంలో ఆయన జిల్లా సహకార ఇన్‌చార్జి అధికారిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో జిల్లాలో కొన్ని సంఘాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. పొదిలి, కొనకనమిట్ల, పల్లామల్లి, కారుమంచి, పొన్నలూరు, కొమరోలు తదితర డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఏకంగా 11 విచారణ కమిటీలు వేశారు. 3 కోట్ల రూపాయలకుపైగా రికవరీలు చేశారు. దీంతో కొందరు ఉద్యోగులకు రాజశేఖర్‌ వైఖరి మింగుడు పడలేదు. ఆయన వ్యవహారశైలి, ఏదైనా అక్రమాలకు పాల్పడుతున్నరా, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న విషయాలపై రెక్కీ చేయడం మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్‌ సదరు ఉద్యోగులపై సస్పెండ్‌ వేటు వేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఉద్యోగులు, ఈయన వలన నష్టపోయిన ఇతర వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శ్రీనివాస్‌, అజయ్‌, నిఖిల్‌, శ్రీకాంత్‌, సుభాష్‌, కార్తీక్‌లను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement