వర్షార్పణం | - | Sakshi
Sakshi News home page

వర్షార్పణం

Published Sun, Oct 20 2024 12:24 AM | Last Updated on Sun, Oct 20 2024 12:26 AM

వర్షా

కర్షకుడి కష్టం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్‌లో పంటల సాగుకు అనుకూలం కాలేదు. పంటల లక్ష్యం నెరవేరలేదు. దీంతో అంతంతమాత్రంగా సాగు చేసిన పంటలు వాయుగుండం రూపంలో వచ్చిన వర్షాలకు నేలపాలయ్యాయి. దసరా పండుగతో మొదలుపెట్టిన వర్షాలు వరుసపెట్టి కురుస్తూనే ఉన్నాయి. 2024 ఖరీఫ్‌ సాగు లక్ష్యం 2,02,249 హెక్టార్లు. అయితే అక్టోబర్‌ 7వ తేదీ వరకు కేవలం జిల్లాలో 1,60,017 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. భారీ వర్షాలతో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో అన్నదాత కన్నీటిపర్యంతమవుతున్నాడు. శుక్రవారం కాస్త ఎండ కనిపించిందో..లేదో.. శనివారం వర్షాలు మొదలయ్యాయి. జిల్లాలో ప్రధానంగా సజ్జ, మినుము, అలసంద, పత్తి, వరి, పొగాకు రైతులకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం 22 మండలాల పరిధిలోని ఉద్యానవన పంటలు మిర్చి, పండ్ల తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వాటిలో మిర్చి 495 హెక్టార్లలో, కూరగాయలు 47 హెక్టార్లలో, అరటి 16, బొప్పాయి 4 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. పొగాకు 5 మండలాల్లో దాదాపు 40 హెక్టార్ల వరకు పొగ నారు విత్తిన పొలాల్లో నీట మునిగింది.

రూ.350 కోట్లకుపైగా పంట నష్టం...

వరుసగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రూ.350 కోట్లకుపైగా పంట నష్టం వరుస వర్షాల కారణంగా వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,602 హెక్టార్లలో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని అంచనా వేశారు. మొత్తం 17 మండలాల్లో 90 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 4 వేల హెక్టార్లలో 3,300 మందికిపైగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక మోస్తరుగా పంటలు నష్టపోయిన రైతులు మరో ఐదారు వేల మంది ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టంపై ప్రాథమిక అంచనాలను సిద్ధం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న నీరు బయటకు పోతే కానీ పూర్తి స్థాయి పంట నష్టం అంచనాలు ఒక కొలిక్కి రావు. ఇదిలా ఉండగా శనివారం మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు.

– సజ్జ పంట కంకులు కోతకు వచ్చాయి. కోసిన కంకులు పొలాల్లో ఉండడంతో వర్షాలకు తడిసి కంకుల్లోనే మొలక వచ్చింది. జిల్లాలో ఖరీఫ్‌లో 7,125 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 6,466 హెక్టార్లలో సాగు చేశారు. అందులో 1,819 హెక్టార్లలో కోసిన పంట నీటిపాలైంది.

– అలసందను జిల్లాలో 4,500 హెక్టార్లలో సాగు చేశారు. అందులో 1,148 హెక్టార్లలో పంట దెబ్బతింది. పంట సాగు దశలో ఉండటంతో నీట మునిగి మొక్కలు కుళ్లిపోయే స్థితికి చేరుకున్నాయి.

– ఖరీఫ్‌ సీజన్‌లో సాగర్‌ ఆయకట్టు కింద త్రిపురాంతకం, తాళ్లూరు, దర్శి, దొనకొండ ప్రాంతాల్లో వరి పంట సాగు చేశారు. ఈ సీజన్‌లో 14,078 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా 9,959 హెక్టార్లలోనే వరి వేశారు. కొన్ని ప్రాంతాల్లో ముందుగా వేయటంతో వరి కంకుల దశకు చేరుకుంది. దీంతో ఈ వర్షాలకు దాదాపు 80 హెక్టార్లలో కంకులతో ఉన్న వరి పైరు తడిసిపోయింది. పంటమీదే ఒరిగి నీట మునిగింది.

– మినుము కోత దశకు చేరుకుంది. కాయ దశలో ఉన్న మినుము పంట వర్షాలకు దెబ్బతింది. ఖరీఫ్‌ సీజన్‌లో 2,520 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 1509 హెక్టార్లలోనే సాగు చేశారు. అందులో 925 హెక్టార్లలో పంట దెబ్బతింది.

– మిర్చి పంట సాగు దశలో ఉంది. చిన్నపాటి మొక్కలు కావటంతో పొలాల్లో నీళ్లు నిలిచి అవి కాస్తా నీట మునిగి ఉరకెత్తే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 23,873 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటికే దాదాపు 22 వేల హెక్టార్లలో సాగు చేశారు. అందులో 495 హెక్టార్లలో పంట దెబ్బతింది.

– పొగాకు పంట పూర్తి స్థాయిలో సాగు చేయలేదు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాల ఆధారంగా పంటలు సాగు చేస్తారు. అయితే ఇప్పటి వరకు కేవలం జిల్లాలో 6,784 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. మొక్క దశలో ఉండటంతో నీట మునిగిన పొలాల్లో నీటిని బయటకు పంపే ప్రయత్నంలో రైతులున్నారు. మొత్తం మీద 40 హెక్టార్లలో మాత్రమే పొగాకు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. జిల్లాలో 750 హెక్టార్లకు పైగా వరి నారుమళ్లు పెట్టారు. ఈ వర్షాలు నారుమడులకు మేలు చేస్తాయని పొగాకు రైతులు చెబుతున్నారు.

ఎడతెరిపి లేని వానలు నీటి ముంపులో పంటలు ఖరీఫ్‌లో 1.60 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు ఇప్పటి వరకు 4,602 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా రూ.350 కోట్లకుపైగా పంట నష్టం సజ్జ, మినుము, అలసంద పంటలపై తీవ్ర ప్రభావం పొగాకు పంటకు కష్టం.. మిర్చి రైతుకు నష్టం

No comments yet. Be the first to comment!
Add a comment
వర్షార్పణం1
1/5

వర్షార్పణం

వర్షార్పణం2
2/5

వర్షార్పణం

వర్షార్పణం3
3/5

వర్షార్పణం

వర్షార్పణం4
4/5

వర్షార్పణం

వర్షార్పణం5
5/5

వర్షార్పణం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement