పైసా విదల్చకుండా ఉత్సవాలెలా?
గ్రంథాలయాలను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణకు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపింది. ఉత్సవాల ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేసిన సర్కారు.. నిర్వహణకు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించడం గమనార్హం. రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల నుంచి వారోత్సవాల నిర్వహణకు బడ్జెట్ మంజూరైన తర్వాత నిధులు కేటాయిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. దాతల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాక గ్రంథాలయాలకు నిధులివ్వడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా కేంద్ర గ్రంథాలయానికి రూ.35 వేలు, ప్రధాన మున్సిపాలిటీల్లో ప్రథమ శ్రేణి గ్రంథాలయాలకు రూ.15 వేలు, ద్వితీయ శ్రేణికి రూ.11 వేలు, మండల కేంద్రాల్లోని తృతీయ శ్రేణి లైబ్రరీలకు రూ.8 వేల చొప్పున ఏటా నిధులిచ్చారు. కానీ ఈ ఏడాది నిధుల కేటాయింపులు లేకపోవడం, ఈ నెల వేతనం ఇప్పటికీ అందకపోవడంతో ఖర్చులపై లైబ్రేరియన్లు తర్జనభర్జన పడుతున్నారు. వ్యాసరచన, సెమినార్, క్విజ్, చిత్రలేఖనం, పాటలు, ముగ్గుల పోటీలు, చదరంగం, ఇతర ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ఎలా ఇవ్వాలో తెలియక దాతల కోసం వెతుకులాట ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment