మనల్నెవర్రా ఆపేది...
మార్కాపురం రూరల్: కూటమి నాయకులకు మట్టి బంగారంలాగా మారింది. అధికారంలోకి రాగానే ఇసుక, మట్టిని తమ కబంద హస్తాల్లో ఉంచుకుని లక్షల రూపాయలను అర్జిస్తున్నారు. మార్కాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన టీడీపీ నేత మట్టిని తవ్వడం.. అమ్ముకోవడం.. వ్యాపారంగా మార్చుకుని అధికారులకు తమ నేత పేరును చెబుతూ బెదిరించుకుంటూ పగలు రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా జేసీబీల సాయంతో చెరువుల్లో తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు అధికార పార్టీని చూసి వెనక్కు తగ్గుతున్నారు. దీంతో ఆ నేత మనల్నెవ్వర్రా ఆపేదంటూ..ట్రాక్టర్ మట్టిని వెయ్యి రూపాయలు, టిప్పర్ అయితే రూ.4 వేలకు విక్రయిస్తున్నాడు. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మట్టి అవసరం బాగా ఉంది. దీనిని సదరు టీడీపీ నేత సొమ్ము చేసుకుంటున్నాడు. దీంతో మార్కాపురం ప్రాంతంలోని పలు చెరువుల రూపురేఖలు మారిపోతున్నాయి. చెరువు మధ్యలోనూ, అంచుల వెంట కూడా జేసీబీతో తవ్వడంతో వర్షాలకు నీరొస్తే కట్ట తెగే ప్రమాదం ఉంది. గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. మండలంలోని నికరంపల్లి, వేములకోట, యాచవరం, నాగులవరం తదితర గ్రామాల్లో ఉన్న చెరువుల్లోని మట్టిని పట్టపగలే మట్టిమాఫియా తరలిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తతంగమంతా అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మట్టి మాఫియాను అడ్డుకోవాలంటూ రైతు సంఘం నాయకులు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులు మట్టి మాఫియాను అడ్డుకొని చెరువులను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా చోద్యం చూస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment