ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి
ఒంగోలు అర్బన్: ప్రతి ఒక్కరూ ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చూడాలని వాటిని శుభ్రంగా ఉంచుకుంటూ వినియోగించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రకాశం భవనంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో హరిత అంబాసిడర్‌లను సత్కరించారు. అనంతరం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవానికి సంబంధించిన అవగాహన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల మరమ్మతులపై దృష్టి సారించాలని వాటిని ప్రజలు పూర్తిగా వినియోగించుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలన్నారు. పాఠశాలలు, వసతిగృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మరుగుదొడ్ల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించి ఏవైనా మరమ్మతులు ఉంటే చేపట్టాలన్నారు. మరుగుదొడ్ల ఆవశ్యకతపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ‘మా టాయిలెట్ మా గౌరవం’ అనే నినాదం ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మరుగుదొడ్ల మంజూరుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. దీనిలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటనాయుడు, డ్వామా పీడీ జోసఫ్‌కుమార్, డీఈఓ కిరణ్‌కుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డిసెంబర్ 5 వరకు కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల మరమ్మతులు
కలెక్టర్ తమీమ్ అన్సారియా
Comments
Please login to add a commentAdd a comment