వైపాలెం టీడీపీలో రచ్చ
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం టీడీపీలో నాయకుల మధ్య పంచాయితీ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాయానికి చేరింది. నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జిగా చెలామణి అవుతున్న గూడూరి ఎరిక్షన్ బాబు తలనొప్పిగా మారాడని, పార్టీని రెండు వర్గాలుగా విభజించి తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆ పార్టీకి చెందిన ఒక వర్గం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి నేతలతో మొరపెట్టుకున్నారు. ఎరిక్షన్ బాబు అరాచకాలను తట్టుకోలేక మంగళవారం మండలం నుంచి దాదాపు 40 వాహనాల్లో 250 మంది ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా నియోజకవర్గంలో ప్రతినెలా నజరానాలు సమర్పించుకునే 10 మంది బియ్యం, లిక్కర్ మాఫియాలకు ఆయన వత్తాసు పలుకుతున్నాడని పార్టీ పెద్దలకు తెలిపారు. పెద్దమొత్తాల్లో డబ్బులు గుంజి పంచాయతీరాజ్ డీఈ సుబ్బారెడ్డి, యర్రగొండపాలెం పంచాయతీ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తాము ఉద్యోగాలు చేపట్టి 5 సంవత్సరాలు దాటినప్పటికీ వారిని స్థాన చలనం చేయకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామాల్లో నీళ్లు తోలకుండా బిల్లులు చేయించుకునేవారికే పెద్దపీట వేస్తున్నాడని, మండలంలోని మురారిపల్లెలో తన అనుమతిలేకుండా ఉచితంగా నీళ్లు సరఫరా చేస్తున్న రమణారెడ్డిపై కక్షకట్టి తాగే నీటిలో తన మనుషులతో పురుగుల మందు కలిపించాడని, అంతేకాకుండా పోలీసులను ఇంటిపైకి పంపి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని వారు ఆరోపించారు. పార్టీ అభివృద్ధి కోసం కాకుండా తన అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని అందినకాడికి డబ్బులు గుంజి వెనకేసుకుంటున్నాడని వారు ఆవేదన వ్యక్త చేశారు. వెంటనే నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమించాలని లేకుంటే రెండు, మూడు రోజులకు ఒక మండలం నుంచి టీడీపీ వర్గీయులు అధిక సంఖ్యలో కేంద్ర కార్యాలయానికి రావలసి వస్తోందని వారు వాపోయారు. టీడీపీ రాష్ట్ర నాయకులు షరీఫ్, వర్ల రామయ్య, రాంబాబులతో కలిసి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పరిస్థితుల గురించి వివరించినట్లు వారు తెలిపారు. మంగళగిరికి వెళ్లినవారిలో ఆ పార్టీ నాయకులు చేకూరి ఆంజనేయులు, వడ్డముడి లింగయ్య, షేక్ జిలానీ, పోతిరెడ్డి రమణారెడ్డి, నాగరాజు వెంకటేశ్వర్లు, వెన్నా వెంకటరెడ్డి ఉన్నారు.
మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరిన పంచాయితీ పార్టీకి తల నొప్పిగా మారిన ఎరిక్షన్ బాబు బియ్యం, లిక్కర్ మాఫియాలకు వత్తాసు డబ్బులు గుంజి అవినీతి అధికారులను బదిలీ చేయించని వైనం ఆవేదన వ్యక్తం చేసిన నియోజకవర్గ టీడీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment