ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు కూటమి సర్కారు పన్నాగం
ఒంగోలు టౌన్:
మనవరాలి వయసు కలిగిన బాలికను పరామర్శించి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీద పోక్సో కేసు పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవి విమర్శించారు. బుధవారం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పక్షాలు నోరెత్తకుండా కూటమి ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బాధిత బాలిక తండ్రి కంటే పెద్ద వయసు కలిగిన చెవిరెడ్డి మీద కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి చోద్యాన్ని మరెక్కడా చూడలేదని చెప్పారు. రాష్ట్రంలో ఏమి జరిగినా ప్రతిపక్షాలు ఎవరినీ పరామర్శించకూడదని, ధైర్యం చెప్పకూడదని, సహాయం చేయకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందన్నారు. తప్పుడు సెక్షన్లు పెడితే ప్రజా నాయకుడి ప్రతిష్ట దిగజారదని, ప్రభుత్వ చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మానేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సభ్యుడు, మాజీ స్పెషల్ పీపీ నగరికంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రగిరి మండలం ఎర్రవారిపాలెం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికను కొందరు యువకులు బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటనపై స్వయంగా బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ముసుగు ధరించి వచ్చిన యువకులు తన కూతురిపై కత్తితో దాడి చేశారని, నీళ్లలో మత్తు మందు కలిపి తాగించారని, చేయి, పొట్టపై కత్తితో కోసి ముళ్లపొదల్లో పడేశారని ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు. ఈ సమాచారం తెలిసి చలించిపోయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. బాధితులను పరామర్శించడం, ధైర్యం చెప్పడం లాంటివి చేయకూడదని బీఎస్‌ఎస్ చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వారిపై కేసులు పెట్టి వేధించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. బాలిక తండ్రిని సైతం ప్రలోభాలకు గురి చేసి తప్పుడు ఫిర్యాదులు చేయించిన తీరును ఎండగట్టారు. ఇలాంటి కేసులు న్యాయస్థానాల్లో నిలబడవన్నారు.
వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ నగర కార్యదర్శి ధర్నాశి హరిబాబు మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా చట్టానికి అనుగుణంగా పనిచేస్తే ప్రజలు సంతోషిస్తారని, కక్షపూరిత విధానాలను తిరస్కరిస్తారని చెప్పారు. అధికార పక్షానికి ఒక రూలు, ప్రతి పక్షానికి మరొక రూలు అమలు చేయడం భావ్యం కాదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మనవరాలి వయసున్న బాలిక కుటుంబాన్ని పరామర్శిస్తే కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. సమావేశంలో నగర కార్యదర్శి కఠారి శంకర్, వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం జోనల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఫణిదపు సుధాకర్, బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కటారి ప్రసాద్, మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షుడు షేక్ మీరావలి, 14వ డివిజన్ అధ్యక్షుడు చావలి శివ, పార్టీ సీనియర్ నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్ , వైయస్సార్‌సిపి మహిళా నాయకురాలు భూమిరెడ్డి రవణమ్మ , సీనియర్ నాయకులు పి.వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసును ఖండించిన
ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవి
బాఽధితులను పరామర్శిస్తే కేసులు నమోదు చేయడం ఎక్కడా చూడలేదని ధ్వజం
దళిత కుటుంబాన్ని అడ్డుపెట్టి కేసుల నమోదు సిగ్గుచేటన్న వైఎస్సార్ సీపీ లీగల్ సెల్
బాధిత కుటుంబాలను పరామర్శించకూడదని బీఎన్‌ఎస్ చట్టంలో ఉందా అని ప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment