ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి

Published Thu, Nov 28 2024 12:23 AM | Last Updated on Thu, Nov 28 2024 12:50 AM

ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి

ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి

ఒంగోలు అర్బన్‌: ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా పరిశీలకురాలు ఏ సూర్యకుమారి స్పష్టం చేసారు. ప్రకాశంభవనంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి ఎస్‌ఎస్‌ఆర్‌–2025 ఓటర్ల జాబితా స్వఛ్చీకరణపై ఈఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఓటర్ల జాబితా పరిశీలకురాలు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎంతో కీలకమన్నారు. అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన జాబితా రూపొందించాలన్నారు. జిల్లాలో 18 నుంచి 20 ఏళ్ల వయసున్న యువతను తప్పనిసరిగా ఓటరరుగా నమోదు చేయాలన్నారు. ఓటరు నమోదు ఫారాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఓటర్ల జాబితాలో లాజికల్‌, డెమోగ్రాఫికల్‌ పొరపాట్లు ఉంటే వాటిని సవరించాలన్నారు. ఓటర్ల తొలగింపు ప్రక్రియను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటరుకార్డుకు ఆధార్‌ మ్యాపింగ్‌ ప్రక్రియ నూరుశాతం పూర్తి చేయాలన్నారు. ఓటర్ల జాబితా తయారీ సమయంలో అన్ని అంశాల్లోని వ్యత్సాలను పరిశీలించాలన్నారు. ఓటరు నమోదు కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు.

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో ఒక పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 8 మంది ఈఆర్‌ఓలు ఉన్నట్లు వివరించారు. ఓటరు జాబితాకు సంబంధించి అక్టోబర్‌ 29 నాటికి 18,19,566 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 2183 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించామని తెలిపారు. 2025 ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియను చేపడుతున్నట్లు వివరించారు. నూరుశాతం ఓటరుకు ఆధార్‌ నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్‌కలెక్టర్‌ సహదీత్‌ వెంకటత్రివినాగ్‌, డీఆర్‌ఓ ఓబులేసు, ఒంగోలు, కనిగిరి ఆర్‌డీఓలు లక్ష్మీప్రసన్న, కేశవర్ధన్‌రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్‌, వెంకట శివరామిరెడ్డి, వెంకటసత్యనారాయణ, ఏఈఆర్‌ఓలు, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్‌, ఇతర పార్టీల ప్రతినిధులు రసూల్‌, రాజశేఖర్‌, సత్యం, రఘురాం తదితరులు పాల్గొన్నారు.

18 ఏళ్లు వయసు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలి

ఓటర్ల జాబితా పరిశీలకురాలు సూర్యకుమారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement