ఉల్లీ.. దిగిరావే తల్లీ!
కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి
కేజీ ధర
రూ.65 నుంచి
రూ.70 పైమాటే..
అల్లాడుతున్న
పేద, మధ్య తరగతి ప్రజలు
కనిగిరి రూరల్: నిత్యావసర సరుకుల ధరలు కల్లెం లేని గుర్రంలా దౌడు తీస్తుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఠారెత్తిపోతున్నారు. మరో వైపు కూరగాయల ధరలు కొండెక్కి కూర్చోవడంతో సగటు వేతన జీవులు సైతం అల్లాడిపోతున్నారు. బియ్యం, వంట నూనెలతోపాటు ఉప్పు, పప్పూ ధరలు దిగిరాకపోవడంతో పేదలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఉల్లిపాయ కోస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ కూటమి ప్రభుత్వంలో ఉల్లిపాయ కోయకుండానే ధరలు కన్నీరు తెప్పిస్తున్నాయి! దాదాపు అన్ని ఆహార పదార్థాల్లో వినియోగించే ఉల్లిపాయలను ప్రస్తుతం బంగారంలా చూసుకునే పరిస్థితి దాపురించింది. నాలుగు నెలల క్రితం కేజీ రూ.30 నుంచి రూ.35 వరకు పలికిన ఉల్లిపాయలను ప్రస్తుతం మార్కెట్‌లో రూ.65 నుంచి రూ.70కు విక్రయిస్తున్నారు. ఉల్లి దిగుమతి తగ్గిందని సాకులు చెబుతున్న విక్రయదారులు, ధరలను మరింత పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరల ప్రభావం హోటల్స్‌పైనా పడింది. కూరల్లో ఉల్లికి బదులు క్యాబేజీని వినియోగిస్తుండటం గమనార్హం. ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతుండటంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నిత్యవసర ధరలను అదుపులోకి తేవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని మహిళలు మండిపడుతున్నారు.
అన్ని వర్గాలకూ ధరా భారం
కార్తీక మాసంతో పాటు, వివిధ శుభాకార్యాలకు ఉల్లి ధర భారంగా మారింది. పవిత్ర కార్తీక మాసంలో కూరగాలయపైనే ఎక్కువగా ఆధాపడి వంటకాలు చేస్తారు. పెరిగిన కూరగాయలు, ఉల్లి ధరలతో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఉల్లి ధర పెరిగినందున హోటళ్లలో తినుబండారాల రేట్లు పెంచి విక్రయాలు చేస్తున్నారు.
కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఽకూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లిపాయల ధర కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు వంటకాల్లో ఉల్లిపాయలు
వేసుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే
స్పందించి ధరలను నియంత్రించాలి.
– జి.గాయత్రి దేవి,
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment