పెద్దపులి దాడిలో ఎద్దు మృతి
అర్థవీడు: మేతకు వెళ్లిన ఎద్దుపై పెద్ద పులి దాడి చేసిన ఘటన మండలంలోని వెలగలపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చెల్లె వెంకట్రావుకు చెందిన ఎద్దు మేతకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అటవీ ప్రాంతంలో వెతుకుతుండగా పెద్దపులి దాడి చేసి చంపేసినట్లు గుర్తించారు. బీట్ గార్డ్ అబ్దుల్ గఫార్, పశు వైద్యాధికారి రాజేశ్ చనిపోయిన ఎద్దుకు పోస్టుమార్టం చేశారు. రైతుకు నష్టపరిహారం అందేలా చూస్తామని అధికారులు తెలిపారు.
హోంగార్డు సతీమణికి కారుణ్య నియామకం
ఒంగోలు టౌన్: వూర్కాపురం డివిజన్‌లో విధులు నిర్వహిస్తూ గత ఏడాది మే 5న మరణించిన హోంగార్డు పి. శ్రీను సతీమణి పి. కాశమ్మకు ఎస్పీ ఏఆర్ దామోదర్ కారుణ్య నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నియామక పత్రాన్ని అందజేసిన ఎస్పీ.. కుటుంబసభ్యుల వివరాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో మెలగాలని, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించి పోలీసు శాఖలో మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. మరణించిన పోలీసు, హోంగార్డు కుటుంబసభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. ఆర్ సీతారామిరెడ్డి, హోంగార్డు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
మహిళ హత్యపై
పోలీసుల విచారణ
టంగుటూరు: టంగుటూరు వాణీనగర్‌లో మహిళ హత్యపై పోలీసులు ముమ్మర విచారణ సాగిస్తున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం హైమావతి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్సై నాగమల్లీశ్వరరావులు హత్యకు సంబంధించి పలువురు అనుమానితులను బుధవారం స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అదే విధంగా ఘటన జరిగిన ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు, ఫోన్ల రికార్డులు పరిశీలించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
చీమకుర్తి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు పద్మచరణ్ శెట్టి(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొట్టకూటి కోసం ఒడిశా నుంచి వలస వచ్చిన పద్మచరణ్ చీమకుర్తి రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి భార్యతో జరిగిన గొడవ వల్ల మనస్థాపానికి గురై అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment