జిల్లాలో దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని అన్నవరప్పాడు మొదటిలైనులో నివాసం ఉండే సూరేపల్లి వెలుగొండరావు నరసరావుపేటలో బంధువుల ఇంట్లో జరుగుతున్న ఒక శుభకార్యానికి ఈ నెల 5వ తేదీ వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి వచ్చి చూస్తే బీరువా తాళం పగులగొట్టి లోపల దాచి ఉంచిన 200 గ్రాముల బంగారు నగలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. దీని విలువ రూ.16 లక్షల వరకు ఉంటుంది. గత నెలలో నగరంలోని గాంధీనగర్ 4వ లైనులో సినీఫక్కీలో దొంగతనం జరిగింది. సాయంత్రం కామేపల్లి సుబ్బ రత్తమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఉన్నారు. అటుగా బురఖాలో వచ్చిన ఒక వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. ఏమరుపాటులో ఉన్న ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. అప్పటికే అక్కడ మరోవ్యక్తి మోటారు బైకు మీద వేచి చూస్తున్నట్లు సీసీ కెమెరాల్లో కనిపించింది. మద్దిపాడు మండలంలో పెద్ద కొత్తపల్లికి చెందిన కాటా భారతి గత నెల 8వ తేదీ బెంగళూరులోని కుమారుడి వద్దకు వెళ్లారు. తిరిగి ఈ నెల 2వ తేదీ ఊరికి వచ్చి చూస్తే బీరువాలో దాచి ఉంచిన 5.5 సవర్ల బంగారు గొలుసు, సవర విలువ చేసే రెండు ఉంగరాలతో పాటుగా రూ.30 వేల నగదు మాయమైంది. మొత్తం రూ.3.5 లక్షలు చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment