అగ్రిగోల్డ్ సొత్తు పచ్చదొంగల సొంతం
యర్రగొండపాలెం: అగ్రిగోల్డ్ సొత్తును పచ్చ దొంగలు దోచుకుంటున్నారు. తమను ఎవరు అడుగుతారన్న ధైర్యంతో వారు రెచ్చిపోతున్నారు. మండలంలోని వీరభద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న రాయవరం రెవెన్యూ మజరా గ్రామంలో అగ్రిగోల్డ్‌కు చెందిన 155 ఎకరాల భూమి ఉంది. అందులో జామాయిల్ చెట్లు పెంచారు. ఈ చెట్లు ఏపుగా పెరగడంతోపాటు ఇటీవల రైతులు బర్లీ పొగాకు ఎక్కువగా సాగు చేస్తున్నారు. పొగాకు ఆకును ఆరబెట్టేందుకు పందిర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఈ కారణంతో ఒక్కొక్క చెట్టు రూ.450 పలుకుతుంది. అంతేకాకుండా మార్కెట్‌లో జామాయిల్ విలువ టన్ను రూ.8 నుంచి రూ.10 వేల వరకు పలుకుతుందని పలువురు రైతులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జామాయిల్‌కు అధిక ధర పలుకుతుండటంతో టీడీపీ నేతకు కన్నుకుట్టింది. వెంటనే నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో కూలీలను రప్పించి టన్నుల కొద్దీ జామాయిల్ చెట్లను నరికించి లారీల్లో తరలించాడన్న ఆరోపణలు వినవస్తున్నాయి. రాయవరంతో పాటు మండలంలోని వెంకటాద్రిపాలెంలో 80 ఎకరాలు, కొలుకులలో 60 ఎకరాలు, త్రిపురాంతకం మండలంలోని దూపాడులో 120 ఎకరాలు, హసనాపురంలో 1000 ఎకరాలు, కంభంపాడులో 250 ఎకరాల ప్రకారం మొత్తం 1665 ఎకరాల్లో జామాయిల్ మొక్కలను పెంచారు. అగ్రిగోల్డ్ సంస్థ వివాదాల్లో పడటంతో ఆ చెట్లను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను సంరక్షించింది. బాధితులకు అండదండ అందించడంతోపాటు కొంత మేరకు నష్టపరిహారం కూడా అందించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడటంలో పూర్తిగా విఫలమైంది. ఆ సంస్థ బాధితులను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ అండదండలు మెండుగా ఉన్నాయన్న పచ్చ నాయకులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంలో భాగంగా కొంతమంది అగ్రిగోల్డ్ భూముల్లో వేసిన జామాయిల్ చెట్లను నరుక్కొని సొమ్ము చేసుకుంటుంటే, మరి కొంతమంది ఆ సంస్థకు చెందిన సింగరాయ హిల్స్ గ్రీన్ పవర్‌జెన్‌కో ప్రైవేట్ లిమిటెడ్ పేరు చెప్పుకొని భూములనే అమ్ముకుంటున్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకొని అగ్రిగోల్డ్ ఆస్తులను రక్షించి తమకు న్యాయం చేయాలని పలువురు ఆ సంస్థ బాధితులు కోరుతున్నారు.
రూ.లక్షల విలువైన జామాయిల్ చెట్లు నరికి తరలింపు పెద్ద సంఖ్యలో నెల్లూరు నుంచి కూలీలను రప్పించిన వైనం ఏ మాత్రం పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment