ఒంగోలు సబర్బన్: పంటల బీమా నమోదుకు గడువు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బివై) పథకం కొన్ని పంటలకు ఈనెల 15వ తేదీతో బీమా ప్రీమియం చెల్లించే గడువు ముగిసింది. 2024–25 సీజన్‌కుగాను వరి, శనగ, జొన్న, మినుము, మొక్కజొన్న, ఎర్ర మిరప పంటలను నోటిఫై చేసిన విషయం తెలిసిందేనన్నారు. అయితే వరి పంటకు సంబంధించి బీమా నమోదుకు ఆఖరి తేదీ ఈ ఏడాది డిసెంబర్ 31కాగా మిగిలిన ఐదు పంటల బీమా నమోదుకు డిసెంబర్ 15వ తేదీతో గడువు ముగిసిందన్నారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం మిగతా పంటలకు కూడా బీమా నమోదు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిందని చెప్పారు. జిల్లాలోని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామన్ సర్వీస్ సెంటర్లలో (సీఎస్‌సీ) సంప్రదించి నోటిఫై చేసిన వరి, శనగ, జొన్న, మినుము, మొక్కజొన్న, ఎర్రమిరప పంటలకు కూడా ప్రీమియం చెల్లించి పంటల బీమా నమోదు చేసుకోవాలని ఆయన రైతులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment