ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల శాఖల పరిధిలో పదో తరగతికి సంబంధించి 86 వసతి గృహాల్లో 1679 మంది విద్యార్థులు చదువుతున్నారు. పదో తరగతి అంటే విద్యార్థుల ఉన్నత భవితకు తొలిమెట్టు. ఇందులో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులు తపన పడుతుంటారు. సరైన ప్రణాళికలు లేకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది. మంచి మార్కుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత అయ్యేదే కష్టంగా మారిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పది పరీక్షలకు మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇంత వరకూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ట్యూషన్లు, ఆల్ ఇన్ వన్ గైడ్లు అందలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ట్యూటర్లతో ప్రత్యేక శిక్షణ, ఆల్ ఇన్ ఒన్ గైడ్లు ప్రభ్వుత్వమే అందించేది. ఉత్తమ ఫలితాల సాధన కోసం ముందుగా 100 రోజుల ప్రణాళికను అధికారులు అమలు పరిచేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో పరీక్షలు దగ్గర పడుతున్నా ఎలాంటి ముందస్తు ప్రణాళికలు కనిపించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ట్యూటర్లకు అందని గౌరవ వేతనం..
వసతి గృహాల్లో 10 మంది కంటే ఎక్కువ మంది పదో తరగతి చదివే విద్యార్థులు ఉంటే తప్పని సరిగా ప్రత్యేక ట్యూటర్‌లను ఏర్పాటు చేయాలి. కష్టమైన సబ్జెక్టుల్లో విద్యార్థులకు ప్రత్యేక బోధన చెప్పాలి. లెక్కలు, సైన్స్, ఇంగ్లిషు, హిందీ సబ్జెక్టులలో ప్రత్యేక బోధన అవసరం. ముఖ్యంగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ట్యూటర్‌కు గౌరవ వేతనంగా రూ.1500లను ప్రభుత్వం ఇస్తుంది. ఈ గౌరవ వేతనం తక్కువగా ఉండటంతో ఒక్క ట్యూటర్ రెండు, మూడు సబ్జెక్టులు చెబుతుండటంతో విద్యార్థులకు సరైన బోధన అందడం లేదు. ఆగస్టు నుంచి ఇంత వరకూ ట్యూటర్లకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం గౌరవ వేతనం మంజూరు చేయలేదు. ఇప్పటి వరకూ దాదాపుగా రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంది. వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.
సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి విద్యార్థుల ఆందోళన 100 రోజుల ప్రణాళికను మరచిన అధికారులు ఇంతవరకూ అందని ఆల్ ఇన్ వన్ గైడ్‌లు పరీక్షలు దగ్గర పడుతున్నా అధికారుల్లో కానరాని చలనం ట్యూటర్లకు అందని వేతన బకాయిలు సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో దుస్థితి
అందని ఆల్ ఇన్ ఒన్ గైడ్‌లు
ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో విద్యార్థులకు శాపంలా మారింది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పదో తరగతి విద్యార్థులందరికీ ఆల్ ఇన్ వన్ గైడ్‌లను అందించి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికారులు విద్యార్థులను పట్టించుకోవడంలేదు. ఇంతవరకూ వారికి ఆల్ ఇన్ వన్ గైడ్‌లు అందలేదు. దీంతో వార్షిక పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉండడం శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment