బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు
ఒంగోలు సిటీ: అవసరమైతే కరెంటు చార్జీలు తగ్గిస్తానంటూ బూటకపు హామీలు గుప్పించి చంద్రబాబు గద్దెనెక్కాడని ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ చేపట్టిన పోరుబాట నిరసనకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు అబద్ధాలు, మోసాలు మళ్లీ ఒకసారి రుజువవుతున్నాయని, వాటిని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకటి చెప్తాడు.. ప్రభుత్వంలో ఉంటే ఒకటి చేస్తాడని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కరెంటు చార్జీలు పెంచుతున్నారని అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే పెంచబోనని, తగ్గిస్తానన్నారని చెప్పారు. నవంబరులో రూ.6072.86 కోట్లు, డిసెంబరులో రూ.9412.50 కోట్లు కలిపి మొత్తం రూ.15,485.36 కోట్ల భారం ప్రజలపై మోపారన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఉచితంగా 200 యూనిట్లు ఇస్తే ప్రస్తుతం వాళ్ల ఇంటికి కూడా ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.1500, రూ.2 వేల వరకు బిల్లులు వస్తున్నాయన్నారు. ఉన్న జీఎస్టీలతోనే మోతమోగి ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల మీద జీఎస్టీ, ఆయిల్ పైన జీఎస్టీ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతున్నాడన్నారు. వాహనాలు కొన్నప్పుడు రోడ్‌ట్యాక్స్ కడతామని, కానీ రోడ్లపై ట్యాక్స్ పేరుతో ప్రజలను బాదుతున్నారన్నారు. మన డబ్బులతో పన్నులు వసూలు చేసి, సంపద సృష్టిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. ఖిల్జీ, ఔరంగజేబు లాంటి సంస్కరణాభిలాష కలవాడు చంద్రబాబు అని ప్రజలు గుర్తెరగాలన్నారు. జనం చంద్రబాబుకు ఓట్లు వేస్తారని, తర్వాత ఆయన వాతలు పెడతాడని, ప్రజలు మళ్లీ గుర్తుకొచ్చి పొరపాటు పడ్డాం అని అనుకోవడం ఆనవాయితీగా మారిపోయిందన్నారు. మీ తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పిలుపునిచ్చారన్నారు. పెంచిన చార్జీలు వెనక్కు తీసుకోవాలని ఈ నెల 27వ తేదీ పోరుబాట లాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీగా వెళ్లి కరెంటు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వదలుచుకున్నామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో చర్చి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం నుంచి ఎస్‌ఈ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలుపుతామన్నారు. కరెంటు చార్జీలు తగ్గించే వరకు పోరాటం ఉధృతం చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ ఈ పోరుబాటలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. జగనన్నకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోందని విమర్శించారు. ప్రజలకు పథకాలు ఇవ్వకపోగా ప్రజల నుంచే వసూళ్లకు చంద్రబాబు దిగాడన్నారు. ఓట్లేసిన ప్రజలను ముంచడంలో చంద్రబాబు కొత్త ఆలోచనలు చేస్తున్నాడన్నారు. అబద్ధాలతో ప్రజలను నిట్టనిలువునా ముంచేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఎప్పుడూ నిజం చెప్పే అలవాటు లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలపై మోపిన పన్నుల భారం రద్దు చేస్తానన్నారు. దేశ చరిత్రలో కరెంటు చార్జీలు రూ.15 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం మోపిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. రైతులను గుర్రాలతో తొక్కించడం, రైతులపై కరెంటు చార్జీలు తగ్గించాలని పోరాటం చేస్తుంటే కాల్పులు జరిపిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలో వచ్చి చేయకుండా నిట్టనిలువునా మోసం చేశాడన్నారు.
బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ పెంచనని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు బొట్లా సుబ్బారావు, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, కె.కోటియాదవ్, నటారు జనార్దనరెడ్డి, గుడ్డల వెంకటేశ్వర్లు, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.
పెంచిన విద్యుత్ చార్జీలు వెనక్కు తీసుకోవాలని ఈ నెల 27వ తేదీ పోరుబాట ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు
Comments
Please login to add a commentAdd a comment