గిరిజన గ్రామాల్లోకి తరచూ పులులు, ఎలుగు బంట్లు రాక
నిత్యం ప్రజలపై దాడులు 20 పైగా ఆవులు, గేదెలను చంపిన వైనం
వేటాడుతూ రోడ్లపైకి వచ్చి మృత్యువాత పడుతున్న పులులు
ఐదేళ్లలో 4 పులుల మృతి
భయాందోళనలో దోర్నాల యర్రగొండపాలెం గిద్దలూరు అర్ధవీడు మండలాల ప్రజలు
నల్లమలలో 87 పెద్ద పులులు 100 చిరుతలు
మార్కాపురం: ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి పుట్టినిల్లు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో ప్రధానంగా 87కు పైగా రాయల్ బెంగాల్ టైగర్లు, సుమారు 100 కు పైగా చిరుతలు సంచరిస్తున్నాయి. ఇవికాకుండా వందల సంఖ్యలో దుప్పులు, జింకలు, నీల్‌గాయ్‌లు, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఆహారం, నీళ్ల కోసం ఇవి తరుచూ అటవీ సమీప ప్రాంతాలకు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వన్యప్రాణులను వేటాడుతూ జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి.
దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు, పశువుల కాపర్లు, పొలాలకు వెళ్లే రైతులు, ఉపాధి కూలీలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మార్కాపురానికి చుట్టుపక్కల ఉన్న పెద్దదోర్నాల, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, అర్థవీడు, గిద్దలూరు తదితర మండలాల్లో ఉన్న అటవీసమీప గ్రామాల నుంచి పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
గేదెలు, ఆవులు, ఎద్దులపై దాడిచేసి తింటున్నాయి. పెద్దదోర్నాల మండలంలోని బొమ్మలాపురం, వైచర్లోపల్లి, నల్లగుంట్ల, తుమ్మలబైలు, శ్రీశైల శిఖరం, ఘాట్‌రోడ్డు, అర్థవీడు మండలంలోని గన్నెపల్లి, లక్ష్మీపురం, మాగుటూరు తాండ, వెలగలపాయ, దొనకొండ, మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల తదితర గ్రామాల శివార్లలో నాలుగు నెలల వ్యవధిలో చిరుతలు, పెద్దపులులు వచ్చి 20కి పైగా గేదెలు, ఎద్దులను హతమార్చాయి.
ఇదే సమయంలో గిద్దలూరు–నంద్యాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో రాత్రిపూట చిరుతలు, పెద్దపులులు వచ్చి రైలును ఢీకొని మృత్యువాత పడుతున్నాయి. ఆహారం, నీళ్ల కోసం రోడ్లపైకి వచ్చి వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. వీటితోపాటు పొలాల్లో రైతులు అడవి పందుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌త్ తీగలు తగిలి చనిపోతున్నాయి. పెద్దపులులు, చిరుతలకు అడవిలోనే నీటి సమస్య లేకుండా సోలార్ సాసర్‌పిట్‌లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చారు.
బేస్ క్యాంపుల ఏర్పాటు...
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలు తెలుసుకునేందుకు బేస్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి కదలికల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గంజివారిపల్లె సమీపంలోని పెద్దన్న బేస్ క్యాంప్, ఇష్టకామేశ్వరి ఆలయం, దొరబైలు, నారుతడికల, పాలుట్ల, కొలుకుల, తుమ్మలబైలు, వెదురుపడియ, కొర్రపోలు, చినమంతనాల, రోళ్లపెంట తదితర ప్రాంతాల్లో బేస్ క్యాంప్‌లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు అటవీ అధికారులు ఉంటారు. అడవిలోకి ఎవరూ వెళ్లకుండా ఉండేందుకు కొర్రపోలు, శిరిగిరిపాడు, దోర్నాల గణపతి గుడి వద్ద ఫారెస్ట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 120 మంది ప్రొటెక్షన్ వాచర్లు పులుల సంరక్షణలో ఉన్నారు.
చనిపోతున్న పులులు, చిరుతలు
జనారణ్యంలోకి వస్తున్న పులులు, చిరుతలు మృత్యువాతపడుతున్నాయి.
● గతేడాది అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలో విద్యుత్ కంచె తగిలి చిరుత మృతి చెందింది.
● 2023 నవంబరు 10న శ్రీశైలం ఘాట్‌లో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. అదే ఏడాది రోడ్డు దాటుతున్న ఏడాదిన్నర వయస్సున్న చిరుతపులి పిల్ల గుర్తుతెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడింది.
● 2022 జనవరి 6న దోర్నాల మండలం రోళ్లపెంట సమీపంలో బావిలో పడి చిరుతపులి మృతి చెందింది.
● 2021 నవంబరు 12న గిద్దలూరు–నంద్యాల మధ్య చలమ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ దాటుతూ ప్రమాదవశాత్తు రైలుకిందపడి పెద్దపులి మృతి చెందింది.
●2020 ఏప్రిల్‌లో యర్రగొండపాలెం సమీపంలోని గాలికొండ అటవీ ప్రాంతంలో వృద్యాప్యంతో తీవ్రమైన ఎండ వేడిమి తట్టుకోలేక పెద్దపులి మృతి చెందింది.
వన్యమృగాల దాడులు ఇలా..
● గత నెల 26, 27 తేదీల్లో అర్ధవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం, నాగులవరం రోడ్డులో చిరుత సంచారాన్ని ప్రజలు గమనించారు.
● గత నెల 15న శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది.
● 2023 డిసెంబరులో పొదిలి మండలం కంభాలపాడు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది.
● 2023 డిసెంబరు 23న దోర్నాల మండలం జమ్మిదోర్నాల వద్ద కుక్కల దాడిలో కృష్ణజింక మృతి చెందింది.
● 2023 డిసెంబరులో పెద్దదోర్నాల మండలం కొత్తూరు గ్రామంలో పశుగ్రాసానికి వెళ్లిన ఏరువ జయరామిరెడ్డిపై అడవిపంది దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది.
● 2023లో 7 గేదెలు, 2 ఆవులు, 2 ఎద్దులు వణ్యమృగాల బారినపడి మృతి చెందాయి.
● గతేడాది 5 గేదెలు, 2 ఆవులు, 3 ఎద్దులు మృతి చెందాయి.
● 2023–2024 సంవత్సరాల్లో మార్కాపురం, గిద్దలూరు పరిధిలో సుమారు 20కిపైగా పశువులను, పెద్దపులి, చిరుతపులులు దాడిచేసి చంపాయి.
● రెండేళ్లలో అడవి జంతువుల బారినపడి చనిపోయిన గేదెలు, ఎద్దులు, ఆవుల యజమానులకు సంబంధించి అటవీశాఖ అధికారులు సుమారు రూ.6 లక్షల వరకూ పరిహారాన్ని అందించారు.
ఇలా అటవీ సమీప గ్రామాల్లోని పొలాల్లో పెద్దపులి, చిరుతలు, పశువులు, మేకలు, గొర్రెలను వేటాడుతున్నాయి.
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. అడవిలోనే వాటికి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నాం. వన్యప్రాణులు జన వాసాల్లోకి వస్తే మాకు వెంటనే సమాచారం తెలపండి. వాటి రక్షణకు చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అడవిలో లోతట్టు ప్రాంతాలకు వెళితేనే పెద్దపులులు, చిరుతలు దాడులు చేస్తాయి. గడ్డికోసం పశువులను తీసుకె ల్వరు లోతట్టు అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దు.
– సందీప్ కృపాకర్, డిప్యూటీ డైరెక్టర్, మార్కాపురం
Comments
Please login to add a commentAdd a comment