నారీ..లక్ష్యం చేరి
ఒంగోలు టౌన్: పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షలు 4వ రోజుకు చేరాయి. తొలిరోజు నుంచి పురుష అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుండగా శుక్రవారం తొలిసారి మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం 5 గంటల నుంచి పరీక్షల ప్రక్రియ మొదలైంది. తొలుత అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్ మెజర్‌మెంట్ పరీక్షలు నిర్వహించారు. తదుపరి 1600 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల లాంగ్ జంప్ వంటి ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు జరిగాయి. పరీక్షల సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఆర్‌ఎఫ్‌ఐడీ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 455 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 194 మంది పాల్గొన్నారు. వారిలో 123 మంది తదుపరి రాత పరీక్షలకు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఉత్సాహభరిత వాతావరణంలో పోలీసు నియామక పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఎవరైనా సరే పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తే వెంటనే డయల్ 112కు ఫోన్ చేయాలని, లేకుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మధ్య దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. ఈ ఈవెంట్స్‌లో అడిషనల్ ఎస్పీ (అడిషనల్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, పీటీసీ డీఎస్పీ మాధవ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ లక్ష్మణ్ కుమార్, డీపీవో ఏఓ రామ్మోహనరావు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఆర్‌లు సీతారామిరెడ్డి, రమణారెడ్డి, రమేష్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా పోలీసు ఉద్యోగాలకు దేహదారుఢ్య పరీక్షలు 194 మంది హాజరుకాగా 123 మంది రాత పరీక్షలకు ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment