సావిత్రి బాయి స్ఫూర్తితో మహిళలు పోరాడాలి
ఒంగోలు టౌన్: మహిళలకు చదువు చెప్పేందుకు ప్రాణాలకు తెగించి పాఠశాల నిర్వహించిన సావిత్రి బాయి స్ఫూర్తితో మహిళలు చైతన్యవంతులై పోరాటాల్లో పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మంచిపుస్తకం వద్ద శుక్రవారం బీసీ సమన్వయ కమిటీ, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. తొలుత సావిత్రి బాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ నాటి సమాజంలో మహిళల వెనకబాటుకు కారణం ఆధునిక విద్య లేకపోవడమే అని గుర్తించిన సావిత్రి బాయి దళితులు, బహుజనులకు పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. భర్త జ్యోతిరావు పూలే సహకారంతోపాటు ఫాతిమా షేక్ అనే ముస్లిం మహిళ తోడ్పాటుతో ఆమె నిమ్న జాతులకు చదువు చెప్పి విజ్ఞాన జ్యోతులుగా మలిచారని చెప్పారు. సావిత్రి బాయి జయంతి జనవరి 3వ తేదీ కాగా ఫాతిమా షేక్ జయంతి జనవరి 9వ తేదీ జరుగుతుందని, కొన్నేళ్లుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో జనవరి 3 నుంచి 9వ తేదీ వరకు సావిత్రి బాయి, ఫాతిమా షేక్ జయంతి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజంలోని అట్టడుగు ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సావిత్రిబాయి ఎన్నో అవమానాలను సహించారని, మరెన్నో దాడులను ఎదుర్కొన్నారని తెలిపారు. ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్ మాట్లాడుతూ సావిత్రి బాయి పూలే దంపతులు 1948లో సత్య శోధక సమాజాన్ని నెలకొల్పి సీ్త్రలకు, అణగారిన వర్గాల ప్రజలకు పాఠశాలలను స్థాపించి విద్యాబోధన కొనసాగించారని తెలిపారు. జనవరి 3వ తేదీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చుండూరి రంగారావు, టి.వెంకటస్వామి, భీమవరపు సుబ్బారావు, గుంటూరు మస్తాన్ రావు, కేవీ శేషమ్మ, తోరటి ఆనంద్, పిన్నిక శ్రీనివాస్, వీరాంజనేయులు, ఇత్తడి రవికుమార్, పరిటాల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment